calender_icon.png 11 October, 2024 | 10:02 PM

ఐఫోన్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత

01-10-2024 12:00:00 AM

చెన్నై: తమిళనాడులోని హొసూరు వద్ద యాపిల్ ఐఫోన్ భాగాలను తయారు చేసే టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌ల్లో ఉత్పత్తి నిరవధికంగా నిలిచిపోయింది. రెండు రోజుల క్రితం ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దీని తర్వాత మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి ఇప్పుడిప్పుడే కొనసాగే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది.

ప్రమాదం సమయంలో పడిపోయిన షెడ్లను తొలగి స్తున్నప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదం లేదా పొగ వచ్చే అవకాశాలు ఉన్నందున ప్లాంట్‌లో ఫైరింజన్లను అందు బాటులో ఉంచినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.వేలు  అన్నారు. అగ్నిప్రమాదానికి కారణాన్ని ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. ప్లాంట్‌లో శనివారం తెల్లవారుజామున మంట లు చెలరేగాయి.

10 మంది స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు. యాపిల్ చైనాను దాటి భారత్‌ను కీలక వృద్ధి మార్కెట్‌గా చూస్తున్న నేపథ్యంలో ఐఫోన్ సరఫరా గొలుసును ప్రభావితం చేసే తాజా సంఘటన ఇది. ఈ సంఘటనపై యాపిల్ వ్యాఖ్యానించలేదు.

మరోవైపు టాటా మాత్రం అగ్నిప్రమా దానికి కారణం ఏంటన్నదానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్లాంట్‌లోని ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించింది. ఈ ప్లాంట్‌ల్లో ఐఫోన్లకు క్లిష్టమైన బ్యాక్ ప్యానెళ్లతోపాటు కొన్ని ఇతర భాగాలను తయారు చేస్తారు. ఇదే కాంప్లెక్స్‌లోని మరో భవనంలో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ఈ ఏడాది చివర్లో ప్రారంభించాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాద ప్రభావం దీనిపై ఎంత మేరకు పడిందో స్పష్టంగా తెలియలేదు.