calender_icon.png 4 October, 2024 | 6:56 AM

2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తి

04-10-2024 02:02:38 AM

  1. సెమీకండక్టర్ల ఇండస్ట్రీకి విస్తృత అవకాశాలు
  2. తెలంగాణలో పానాసోనిక్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తాం: భట్టి విక్రమార్క 

హైదరాబాద్, అక్టోబర్ 3(విజయక్రాంతి): 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా గురువారం ఆయన క్విటో నగరం సమీపంలోని ప్రముఖ సెమీ కండక్టర్ల పరిశ్రమ రోహ్మ్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ నిర్ధేశించుకున్న గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలంటే రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందున్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయాలని రోహ్మ్ యాజమాన్యాన్ని భట్టి కోరారు.

భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాల దృష్ట్యా తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే విషయమై ఆలోచిస్తామని రోహ్మ్ ప్రతినిధులు భట్టికి తెలిపారు. 

పానాసోనిక్ కార్యాలయంలో..

క్విటో నగరానికి సమీపంలోని పానాసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని సైతం భట్టి సందర్శించారు. కంపెనీ ప్రెసిడెంట్ నబీ నకానీషితోతో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమ కంపెనీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి నబీ నకానీషితో వివరించారు. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భట్టికి చెప్పారు.

భారత్ లోనూ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని నబీ వెల్లడించారు. తెలంగాణలో ఈవీ వాహనాల సంఖ్య పెరుగుతుందని కంపెనీ ప్రెసిడెంట్‌కు భట్టి చెప్పారు. ఆర్టీసీ బస్సులను కూడా పూర్తిగా ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామన్నారు. అందుకే తెలంగాణలో పానాసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భట్టి కోరారు.

టోజీ బౌద్ధ ఆలయాన్ని భట్టి.. రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువు ఆశీర్వచనాలు అందించారు. గతనెల 24న ప్రారంభమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం విదేశీ పర్యటన గురువారంతో ముగిసింది. శుక్రవారం వారు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.