calender_icon.png 26 November, 2024 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్

25-10-2024 12:34:56 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసినందుకు ఈ నెల 17న సినీ నిర్మాత శివరామకృష్ణను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, అతని ఆరోగ్యం బాగోలేకపోవడంతో కోర్టు ఆ రోజే బెయిల్ మంజూరు చేసింది. కాగా, శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం బెయిల్ రద్దు చేసింది. దీంతో పోలీసులు గురువారం మరోసారి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, రాయదుర్గం ప్రాంతంలో రూ.10 వేల కోట్ల విలువ చేసే 83 ఎకరాల ప్రభుత్వ స్థలంపై శివరామకృష్ణ కన్ను పడి దాన్ని ఎలాగైనా కాజేయాలని పథకం రచించాడు. ఇందుకోసం స్టేట్ ఆర్కియాలజీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కొత్తింటి చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. మరో వ్యక్తి బిల్డర్ మారగోని లింగమయ్య గౌడ్ సాయంతో ఆ భూమిలో పాగా వేశాడు. దీనిపై ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2003 లో అప్పటి ప్రభుత్వం దీని పై కోర్టులో కేసు వేసింది. ప్రభుత్వాలు మారినా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం సాగింది. చివరికి శివరామకృష్ణవి నకిలీ పత్రాలని సుప్రీంకోర్టు తేల్చింది. ఈ తీర్పుతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగమయ్య గౌడ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు గత గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.