అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం (నేడు) విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత రాజేందర్‌రెడ్డి మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే... “ఈ కథను నాకు సంపత్ నంది కరోనా టైమ్‌లోనే చెప్పారు. కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి.
తర్వాత మెల్లిగా షూటింగ్ ప్రారంభించాం. ‘సింబా’ సింహం అని అర్థం. కథానాయకుడు ఇందులో అడవిని కాపాడే వ్యక్తిగా కనిపిస్తాడు. అందుకే ‘సింబా’ అనే టైటిల్ పెట్టాం. జగపతి బాబుతో నాది 25 ఏళ్ల అనుబంధం. ఈ కథకు ఆయన ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం మనం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరముంది. అందుకే కమర్షియల్ అంశాలను మేళవించి ఈ కథను తెరకెక్కించాం.
సినిమా చూసి కొంత మందిలో ఆలోచన కలిగినా నాకు చాలు. అదే నాకు సక్సెస్. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. సామాజిక దక్పథంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. 25 ఏళ్ల క్రితం మీడియాలో పని చేశాను. సమాజ శ్రేయస్సు కోసం, సమాజానికి ఉపయోగపడే చిత్రాలే చేస్తాను. కొన్ని కథలు విన్నాను. కొత్త ప్రాజెక్టులను త్వరలో ప్రకటిస్తాను.