calender_icon.png 17 April, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువ వికాసానికి విఘ్నాలు!

14-04-2025 12:00:00 AM

 సర్వర్ డౌన్‌తో ఆన్‌లైన్ దరఖాస్తులకు ఇబ్బందులు

 ఆఫ్‌లైన్‌లో ఎంపీడీవో కార్యాలయంలో అందజేత

 కొత్త రేషన్ కార్డులు రాక పథకానికి దూరం

 నిరాశలో నిరుద్యోగులు

 నేడే దరఖాస్తుకు చివరి గడువు

సంగారెడ్డి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) ః నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మాఆయి. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ఈ ఏడాది మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.ఈ ప్రక్రియకు అడుగుడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.

దీంతో సర్కారు దరఖాస్తుల తుది గడువును మార్చి 30 నుంచి ఈనెల 14 వరకు పొడిగించింది. అయినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు రకాల సాంకేతి సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సర్కారు నిర్ధేశిత గడువు నేటితో ముగిసిపోతుంది. మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు నిత్యం చక్కర్లు కొడుతున్నా ఫలితం లేకపోవడంతో వారిలో అసహనం వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా సర్వర్ సమస్య ఉత్పన్నం కావడంతో ఆయా మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకుంటున్నారు. 

వేధిస్తున్న సమస్యలు..

గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్ రుణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి యువ వికాసం పథకంలో తొలుత అడ్డంకులు వచ్చాయి. వెబ్‌సైట్ దరఖాస్తులు స్వీకరించలేదు. ప్రస్తుతం వారికి ఇబ్బంది లేకున్నా గతంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్వాంగులు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోతున్నట్లు తెలిసింది.

వెబ్‌సైట్ దరఖాస్తులు స్వీకరించక పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్, పాన్‌కార్డు, కుల ధ్రవీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలి. అయితే కుల, ఆదాయ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయం సర్టిఫికెట్ 2024 ఏప్రిల్ తర్వాత తీసినదై ఉండాల్సి రావడంతో ఎక్కువ మంది మీ సేవ సెంటర్లు, రెవెన్యూ కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నారు. 

రేషన్ కార్డు తిప్పలు..

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది కొన్నేళ్ళుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. నిబంధనల ప్రకారం రేషన్ కార్డులో ఉన్న పేర్లలో ఒకరికి మాత్రమే రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో రేషన్‌కార్డులకు కొత్తగా దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్న వారు యువ వికాసంలో తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా అరులై ఉండి రేషన్ కార్డు రానివారిలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. 

సర్వర్ డౌన్ వల్ల ఇబ్బంది...

సర్వర్ డౌన్ వల్ల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి ఇబ్బంది ఏర్పడింది. అయితే ప్రతీ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాం. రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈనెల 14వరకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంది. గతంలో కార్పోరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న వారు ఐదు సంవత్సరాలు పూర్తయితేనే దరఖాస్తుకు అర్హులు.

 -జగదీశ్, బీసీ వెల్ఫేర్ అధికారి, సంగారెడ్డి