- రెండు మూడు రోజుల్లో పరిష్కారం
- 300 మంది మాస్టర్ ట్రైనర్లకు తర్ఫీదు
- ముమ్మరంగా కొనసాగుతున్న సమగ్ర సర్వే
- 12 రోజుల్లో 58 శాతం సర్వే పూర్తి
- రాష్ట్రంలో 67.72 లక్షల ఇళ్ల నమోదు పూర్తి
- ములుగులో 87.1 శాతం పూర్తి
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే వేగం పుంజుకుంది. కులగణనను సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులతోపాటు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కృషి చేస్తోంది. ఇదే సమయంలో సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్ చేసేందుకు ప్రణాళిక శాఖ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణను ప్రారంభించింది.
ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన 300 మంది మాస్టర్ ట్రైనర్లకు డాటా ఎంట్రీకి సంబంధించి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ సమయంలో డాటా ఎంట్రీలో కొన్ని సాంకేతిక సమస్యలను అధికారులు గుర్తించినట్టు తెలిసింది.
దీంతో హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనర్లు.. జిల్లాల్లోని ఆపరేటర్లకు తర్ఫీదు ఇవ్వడానికి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో సాఫ్ట్‌వేర్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత జిల్లాల్లోని ఆపరేటర్లకు శిక్షణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
సర్వేలో పాల్గొన్న అనుదీప్ దురిశెట్టి
ఆదివారం నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ కలెక్టర్, కులగణన రాష్ట్ర నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అలాగే, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. క్షేతస్థాయిలో కలెక్టర్లు పర్యటించి.. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఉన్న సమస్యలను పరిష్కరించారు.
గ్రామాల్లోనే ఎక్కువ ఇళ్లు సర్వే
రాష్ట్రంలో కులగణన సర్వే పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే వేగంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాటికి 58.3 శాతం పూర్త య్యింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6౭.41 లక్షల ఇళ్ల సర్వే పూర్తయ్యింది. జిల్లాలవారీగా చూసుకుంటే ములుగులో అత్యధికంగా 87.1 శాతం ఇళ్ల సర్వే పూర్తయ్యింది. 81.4 శాతంతో నల్లగొండ, 77.6 శాతంతో జనగామ, 74.8 శాతంతో మంచిర్యాల, 74.3 శాతంతో పెద్దపల్లి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.