పైరవీలకే పరిమితమైన గెలిచిన సంఘాలు
సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి...
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారిన, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాలు మారినప్పటికి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం తీరడం లేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి స్పష్టం చేశారు. ఏరియాలోని శాంతిఖని గనిపై శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసిలు డిసెంబర్ లోనే సంస్థ సిఎండితో స్ట్రక్చరల్ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి, ఇప్పటివరకు ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేస్తున్నాయని, కార్మికుల ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ఇష్టం లేకనే సిఎండితో డిసెంబర్ నెలలో జరగాల్సిన స్ట్రక్చరల్ కమిటీ సమావేశాన్ని ఇప్పటివరకు జరపకుండా వాయిదా వేస్తున్నారని విమర్శించారు.
ఓట్లేసి గెలిపించిన కార్మికులు సొంతింటి పథకం అమలు కాకుండానే దీనంగా దిగిపోతున్నారని, యువ కార్మికులు క్వార్టర్ తీసుకున్నందుకు పెర్క్స్ తో సగానికి పైగా జీతం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుపేరుతో పనిచేస్తున్న కార్మికుల పేర్లు సవరిస్తామని చెప్పిన గెలిచిన సంఘం ఇవేమీ పట్టనట్టు పైరవీలకే పరిమితమవుతూ, ఓడిన సంఘాలను విమర్శిస్తూ, కాలం వెలదీస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులో రికవరీ చేసుకోమని కార్మికులు ఇచ్చిన సంతకాల స్లిప్పులను యాజమాన్యం చూడకుండా రికవరీ చేసిన విధానాన్ని తప్పు పడితే, ఏఐటియుసి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. సొంతింటి కల ఏ విధంగా సాకారం చేయవచ్చునని అర్థమయ్యేలా కరపత్రంతో కార్మికులకు, అధికారులకు, ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లామని తెలిపారు. సింగరేణిలో ప్రధాన ప్రతిపక్షంగా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు గెలిచిన సంఘంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
నవంబర్లో జరిగిన స్ట్రక్చరల్ సమావేశం ఒప్పందాలపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని, డిసెంబర్ నుండి ప్రోత్సాహక ఇన్సెంటివ్ ను ప్రవేశపెడతామని చెప్పి, నెల గడిచిన దానిపైన ఊసే లేకుండా పోయిందన్నారు. ఇలాంటి విషయాలు గెలిచిన సంఘాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికలనేవి కేవలం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికే కానీ గెలిచిన సంఘాలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అధికారులను పై ఒత్తిడి చేస్తూ, ప్రతిపక్ష యూనియన్ కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. కొన్ని గనుల మీద షిఫ్ట్ చేంజ్ లు చేయించుకుంటూ, మళ్లీ యధావిధిగా మారుస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్న విధానాలను గెలిచిన సంఘాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి, కార్యదర్శి అల్లి రాజేందర్, గని పిట్ కార్యదర్శి అబ్బోజి రమణ, నాయకులు జడల ప్రవీణ్, నాగరాజు, బుద్ధ సురేష్, ధనిశెట్టి సురేష్, దేవదాసు సీనియర్ నాయకులు అలవాల సంజీవ్ లు పాల్గొన్నారు.