అరకొరగా కనీస వసతులు
- హాస్టళ్లు, మెస్‌ల నిర్వహణ అద్వాన్నం
- ప్రశ్నించే వారు లేరు, అధికారులు పట్టించుకోరు
దోమలతో విద్యార్థుల నిత్య సహవాసం
న్యాక్ ఏ ప్లస్ గ్రేడున్నా ఇంటర్నెట్ లేని దుస్థితి
పెరుగుతున్న కోర్సులు, తగ్గుతున్న అధ్యాపకులు
జేఎన్టీయూహెచ్‌లో ఇదీ పరిస్థితి
రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మక సాంకేతిక యూనివర్సిటీ అయిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) సమస్యలకు నెలవుగా మారింది. ఈ వర్సిటీకి న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉన్నా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. తరగతి గదులు, హాస్టళ్లలో విద్యార్థులకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు లేడు. అధికారులను ప్రశ్నిస్తే తమ భవిష్యత్‌కు ఇబ్బందులు కలుగుతాయేమో అనే భయంతో విద్యార్థులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు.
అధ్యాపకులు సరిగా లేకపోవడం, ల్యాబ్ వసతి అంతంత మాత్రంగానే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ్ల విద్యార్థులు వాపోతున్నారు. పదవీ విరమణ పొందుతున్న అధ్యాపకుల సంఖ్య పెరుగుతుండటంతో చదువు చెప్పే రెగ్యులర్ టీచర్లు తగ్గిపోతున్నారు. ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి నాణ్యమైన విద్య లభిస్తుందని జేఎన్టీయూకు వచ్చే విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): జేఎన్టీయూహెచ్ రాష్ట్రంలోనే అత్యున్నత సాంకేతిక యూనివర్సిటీ కావడంతో విద్యార్థులు పోటీపడి సీట్లు సాధి స్తున్నారు. బీటెక్‌లో 10 కోర్సులు, ఎంటెక్‌లో 21 స్పెషలైజేషన్ కోర్సులు, ఎంఫార్మసీలో 2 కోర్సులు, 2 ఎంబీఏ కోర్సులు, బీబీఎం కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో ఏడు వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 4 వేల మంది విద్యార్థులు క్యాంపస్ హాస్టళ్లలో వసతి పొందుతున్నారు. పరిశోధక విద్యార్థులు కూడా ఉన్నారు. క్యాంపస్‌లో ఉండి బాగా చదువుకోవచ్చని ఆశతో వచ్చే విద్యార్థులు అరకొర వసతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యాంపస్‌లో 5 మహిళల హాస్టళ్లు, 3 పురుషుల హాస్టళ్లు ఉన్నాయి. ఒకటి ఉపయోగంలోకి రాలేదు.
ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ ఉంది. ఈ హాస్టళ్లలో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సరిపడా బాత్‌రూమ్స్, టాయిలెట్స్ కూడా లేవని విద్యార్థులు వాపోతున్నారు. మెస్‌లలో అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు గడుపుతున్నారు. హాస్టల్ గదుల్లో ముగ్గురికి బదులు ఆరుగురు విద్యార్థులు ఉండాల్సి వస్తోంది. పలు గదుల కిటికీలు పగిలిపోవడం, కిటికీలు, వెంటిలెటర్లకు మెష్‌లు లేకపోవడంతో దోమలతో సహవాసం చేస్తున్నారు. పలుమార్లు హాస్టళ్లలోకి విష సర్పాలు కూడా వచ్చాయని విద్యార్థులు వాపోతున్నారు. ఇన్ని ఇబ్బందులున్నా హాస్టల్‌కు ఉండే వార్డెన్లు నెలకోసారి కూడా అటువైపు తొంగి చూడడంలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. తరగతి గదుల్లో కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ నుంచి ఉదయం వచ్చి, సాయంత్రం మళ్లీ హాస్టల్‌కు వెళ్లాకే మంచినీరు తాగే పరిస్థితి ఉందని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్సులే సరే.. వసతులేవి?
ఆరేండ్ల క్రితం జేఎన్టీయూహెచ్‌లో కెమికల్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీస్, డాటా సైన్స్, బీబీఏ, బీటెక్ బయోటెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్ అనే కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. కానీ ఆ కోర్సులకు అవసరమైన ల్యాబొరేటరీలు ఏర్పాటుచేయలేదు. ఈ కోర్సులు బోధించేదుకు పూర్తి స్థాయి అధ్యాపకులను కూడా నియమించలేదని విద్యార్థులు చెప్తున్నారు. దీంతోపాటు మెస్ బిల్లులు సకాలంలో రాక, వచ్చిన బిల్లులు సరిపోకపోవడంతో సర్టిఫికెట్లు తీసుకునే సందర్భంలో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెండింగ్ మెస్ బిల్లులు సకాలంలో చెల్లించని విద్యార్థులను పరీక్ష ఫీజు కూడా కట్టనివ్వరని, పరీక్షల ఫలితాలను హోల్డ్‌లో ఉంచుతారని ఆరోపిస్తున్నారు. పేరుకు ప్రభుత్వ యూనివర్సిటీ కానీ ప్రైవేటుకన్నా ఎక్కువగా విద్యార్థుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఒకే చోట వసతి..
డిగ్రీ, పీజీ విద్యార్థులకు వేర్వేరు వసతి గృహాలు ఉండాలి. కానీ ఇక్కడ హాస్టల్స్ కొరత కారణంగా డిగ్రీ, పీజీ విద్యార్థులను కలిపి ఉంచుతున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్లు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణ హాస్టల్‌ను పునఃప్రారంభిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని విద్యార్థులు అంటున్నారు. ఆ హాస్టల్ పునరుద్ధరణ పనులు పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభించడం లేదనే ఆరోపనలున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తారని విద్యార్థులు వేచిచూస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న గోదావరి బాయ్స్ హాస్టల్‌ను తొలగించి కొత్త హాస్టల్‌ను నిర్మించాలని కోరుతున్నారు.
పదవుల మీదే ధ్యాస..
జేఎన్టీయూహెచ్ అధికారులకు పదవులపై ఉన్న శ్రద్ధాసక్తులు, విద్యార్థుల మీద లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీ పరిధిలో దాదాపు 250 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వాటితో పోల్చితే జేఎన్టీయూహెచ్‌లో వసతులు దుర్భరంగా ఉన్నాయని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ప్రైవేటు కాలేజీలపై అజమాయిషీ చేసే అధికారులు తమ క్యాంపస్‌పై నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడుతున్నారు. టీజీపీఎస్సీ లాంటి సంస్థల ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం జరిగే పరీక్షల నిర్వహణకు సహకరిస్తున్న జేఎన్టీయూహెచ్‌లో దాదాపు 200 అధ్యాపక పోస్టులు మంజూరైనప్పటికీ వాటిని భర్తీలో అధికారులు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
విద్యార్థులు నవకల్పనల మీద దృష్టి పెట్టి చదువుకోవాల్సి ఉంటుంది. దానికితోడు క్లాస్‌రూమ్స్‌లో అధ్యాపకులు ఇచ్చే అసైన్‌మెంట్స్‌ను ఇంటర్‌నెట్ ద్వారా వెతుక్కోవాల్సి ఉంటుంది. అందుకోసం యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో విద్యార్థుల కోసం ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించారు. అందుకోసం దాదాపు రూ.25 లక్షలు ఖర్చు కూడా చేస్తున్నట్లు సమాచారం. కానీ వైఫై విద్యార్థులందరికీ అందడం లేదు. దీంతో విద్యార్థులు సొంతంగా ఇంటర్నెట్ కోసం నెలకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్తున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
క్యాంపస్‌లోనిని సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జేఎన్టీయూ అభివృద్ధికి అధికారులు కృషిచేయాలి. విద్యార్థులు ఆందోళన చేస్తే అధికారులు భయాందోళనలకు గురి చేస్తున్నారు. హక్కులను అడిగితే నోటీసులు ఇస్తున్నారు. నిరసన తెలిపితే ఇచ్చిన సర్క్యులర్లు, మెమోలను వెనక్కి తీసుకోవాలి.
జవాజి దిలీప్,
జేఎన్టీయూ పరిశోధక విద్యార్థి
24 గంటలు లైబ్రరీ వసతి కల్పించాలి
యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్‌ఐటీల మాదిరిగా 24 గంటలు లైబ్రరీ వసతి కల్పించాలి. ల్యాబ్‌లలో సౌకర్యాలు మెరుగుపర్చాలి. క్యాంపస్‌లో వైఫై సరిగా లేక విద్యార్థులు ఇబ్బందు లు పడుతున్నా రు. ఆ సమస్యను పరిష్కరించాలి. మౌలిక వసతు లు కల్పించాలి.
తేజ, పరిశోధక విద్యార్థి