calender_icon.png 18 November, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అపార్’ కార్డు నమోదులో సమస్యలు

08-11-2024 12:00:00 AM

దేశంలో పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్ ఉన్నట్లే.. ఒక దేశం, ఒక స్టూడెంట్ కార్డు పేరుతో కేంద్రం విద్యార్థులకోసం  జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)ని తీసుకువచ్చింది.  ప్రతి విద్యార్థికి ’అపార్’ కార్డు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. కార్డుపై క్యూఆర్ కోడ్‌తోపాటు 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. అపార్‌తో ఎక్కడి నుంచైనా ప్రవేశాలు పొందవచ్చు.

ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో తొమ్మిది, పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఈ కార్డులు జారీ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. ఒక విద్యార్థికి వచ్చిన గుర్తింపు సంఖ్య, మరో విద్యార్థికి రాదు. ప్రస్తుతం ఆధార్ కార్డులు కూడా ఇదే తరహాలోనే ఉన్నాయి. దేశంలో ఒక వ్యక్తికి ఉన్న ఆధార్ నెంబర్ మరో వ్యక్తికి ఉండదు. సరిగ్గా ఇదే తరహాలో విద్యార్థులకు కూడా గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. 

అయితే సమాచార గోప్యత అనేది  లేకుండాఉంది. ఆధార్, అపార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు అన్నీ లింక్ అయి ఉంటాయి. అపార్  వివరాలు సేకరించే  ఏజెన్సీ  వీటిని ఎవరికైనా  విక్రయిస్తే  విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు  గురి కావాల్సి వస్తుంది.  అపార్ కార్డులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, క్యూఆర్ కోడ్, 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మాత్రం విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, క్యూఆర్ కోడ్, 12 అంకెల గుర్తింపు సంఖ్యతో పాటు ఆ విద్యార్థి మార్కులు, గ్రేడ్లు, ఉపకార వేతనాల వివరాలు, అవార్డులు, డిగ్రీలు, క్రీడలు, ఇతర అంశాల్లో సాధించిన విజయాలతో పాటు సమగ్ర రికార్డు అందుబాటులో ఉంది.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొత్తం వివరాలను తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకు ఉపయోగపడుతుంది. మరోవైపు విద్యార్థుల ఆధార్ సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవల అక్టోబర్ 22 నుంచి 25 వరకూ ఆధార్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కేంద్రాల్లో కేవలం ఫోన్ నంబర్ అప్ డేట్ వంటి చిన్న చిన్న సమస్యలను మాత్రమే సరి చేస్తున్నారు. తండ్రి పేరు, పుట్టినరోజు వివరాల్లో తప్పులు ఉంటే కరెక్షన్ చేసేందుకు బర్త్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు.

దీంతో బర్త్ సర్టిఫికేట్లు లేని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బర్త్ సర్టిఫికేట్లు ఇప్పటికిప్పుడు పొందేందుకు కూడా అవకాశం లేదు. ప్రారంభ దశలోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపితే బాగుంటుంది.

- డా. ముచ్చుకోట సురేష్ బాబు