calender_icon.png 11 April, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

04-04-2025 06:04:31 PM

సరైన వైద్య నిపుణులను నియమించాలి

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సరైన వైద్య నిపుణులను నియమించాలని ఎంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కిరణ్ కుమారికి వినతిపత్రం అందజేశారు. అధునాతన హంగులతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించినా,  తెలంగాణ వైద్య విధాన పరిషత్ దీనిని వంద పడకల ఆసుపత్రిగా గుర్తించలేదని పేర్కొన్నారు., 30 పడకల ఆసుపత్రికి పరిమితమైందని, బడ్జెట్ విషయంలోనూ అదే విధంగా ఉందని పేర్కొన్నారు.

స్పెషలిస్టు డాక్టర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. జనరల్ ఫిజీషియన్ కూడా లేరని, సరైన డాక్టర్లు,వైద్య పరికరాలు లేక జబ్బులతో వచ్చిన రోగులను మంచిర్యాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని, పలుమార్లు సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వినోద్ స్పందించి  30 పడక ల ఆసుపత్రిగా కొనసాగుతున్న బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చే విధంగా చర్యలు చేపట్టేలా  నిధులు కేటాయించాలని కోరారు.

ఆసుపత్రికి సరిపోయే సిబ్బందిని, స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు.24 గంటలు ఎమర్జెన్సీ సేవలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని,టెక్నీషియన్ లను అందుబాటులో ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.మరొక గైనకాలజిస్ట్ డాక్టర్ ను నియమించి  ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఎప్పటికప్పుడు  సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆసుపత్రి సమస్యలను తెలుసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్,తేజ తదితరులు పాల్గొన్నారు.