ఎన్.సీతారామయ్య :
అధిక జనాభాతో అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ప్రజల ఆహార భద్రతను నిర్ధారించడంలో, పరిశ్రమలు, సేవారంగాల వృద్ధిలోను వ్యవ సాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. కానీ, ఇప్పుడు దేశంలో సాగురంగం పర్యావరణ, ఆర్థిక, సంస్థాగత, సాంకేతికత పరంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగిన దేశంగా భారతదేశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మన సాగుబడి కీలకపాత్ర పోషిస్తు న్నది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జనాభాలో 50 శాతానికి పైగా జీవనోపాధిని ఈ రంగమే కలిగిస్తుంది. 60 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. దేశ జీడీపీలో దీని వాటా సుమారు 18 శాతం. దేశ శ్రామికశక్తిలో సుమారు 50 శాతం ఈ రంగంలోనే ఉన్నారు. ఆహార పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు వ్యవసాయం నుండే లభిస్తున్నాయి.
ఇప్పటికీ దిగుబడులు తక్కువే
ప్రజల ఆహార అవసరాలు తీరడానికి వ్యవసాయం తప్పనిసరి. భూమి పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పుడు సాగు ఆర్థికంగా లాభసాటిగా ఉండదు. భూవనరులపై అధిక జనాభా ఒత్తిడి కారణంగా వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా పొడి భూములు తక్కువ దిగుబడిని ఇస్తున్నాయి. వరి, గోధుమ, పత్తి, నూనెగింజలతోసహా భారతీయ పంటల దిగుబడులు అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. హరిత విప్లవం, అస్తవ్యస్త నీటి పారుదల, వ్యవసాయ పద్ధతులు భూమి క్షీణతకు దారితీశాయి. మానవ కార్యకలాపాలవల్ల వర్షాధార ప్రాంతాలు కూడా నేలకోతను, క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ఒకే పంటను పదేపదే సాగు చేయడంవల్ల నేల పోషకాలను కోల్పోయి నిస్సారమవుతున్నది.
చాలా ప్రాంతాల్లో సాగునీరు కోసం భూగర్భజలాలను అధికంగా వాడడం వల్ల వాటి స్థాయిలు క్షీణించాయి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరతోపాటుగా కూలీల వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. పంట పెట్టుబడి కోసం రైతులు అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. పంట నష్ట పోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, అధిక ఖర్చులు వంటివాటివల్ల సగానికి పైగా వ్యవసాయ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. చాలామంది వడ్డీ వ్యాపారులు వంటి అనధికారిక మార్గాలద్వారా రుణాలు పొందుతున్నారు. వాణిజ్య పంటలు సాగుచేసే రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. కరువుతోపాటు పంట నష్టాల వల్ల అనేకమంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కోసారి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అస్తవ్యస్త మార్కెటింగ్ విధానం
నాణ్యమైన ఎరువులు ఉపయోగించక పోవడం వల్ల నిస్సారమైన నేల పంట ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల దిగుబడి మందగించి వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది. అసమర్థమైన వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలు ధరల అస్థిరతకు దారితీస్తాయి. సరైన నిల్వ, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రైతులు వెంటనే తక్కువ ధరకైనా సరే అని ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ఇది పంట అనంతర నష్టాలను మరింతగా పెంచుతుంది. నేరుగా మార్కెటింగ్ విధానం లేకపోవడం వల్ల వచ్చే ఆదాయంలో కొంతభాగం మధ్యదళారీల పాలవుతున్నది. ప్రస్తుతం ఉన్న పంటల విధానం కొన్ని ప్రధాన పంటలవైపు మాత్రమే మొగ్గుచూపేలా ఉంది.
పంటల్లో వైవిధ్యం లేకపోవడంతో వ్యవసాయ రంగం తెగుళ్లు, వ్యాధులు, మార్కెట్ ఒడిదుడుకుల బారిన పడుతున్నది. సాగులో ఆధునిక సాంకేతికలు అమలు పరచడం లేదు. ప్రపంచీకరణ వల్ల రైతు ఆదాయం తగ్గింది. దేశంలోని చాలా ప్రాంతాలలో సాగు పనులు ప్రాచీన పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. నాణ్యమైన విత్తనాల కొరత పెద్ద సమస్యగా మారింది. దేశంలోని దాదాపు అరవై ఐదు శాతం వ్యవసాయం రుతుపవన వర్షపాతంపై ఆధారపడి ఉంది. వాతావరణ మార్పులు అస్థిర రుతుపవనాలకు కారణమవుతున్నాయి. వర్షపాతంలో హెచ్చుతగ్గులు కరువులు, వరదలకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏటా అస్థిరత్వానికి గురవుతున్నది.
భారతీయ వ్యవసాయం ప్రధానంగా ఆహార పంటల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నది. దేశంలో ఆహార భద్రత తృణధాన్యాల పంటలను ఉత్పత్తి చేయడంపై ఆధారపడి ఉందనే సత్యాన్ని ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాయి. ఫలితంగా తృణధాన్యాల ఉత్పత్తికి విలువ పెరుగుతున్నది. దీనికి తోడు పెరుగుతున్న ఆదాయాలు, జనాభా డిమాండ్లను తీర్చడానికి పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తిని అధికం చేయడం వల్ల రైతు ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
బహుముఖ విధానం అవసరం
దేశంలో గణనీయమైన సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. భారతీయ వ్యవసాయంలో సవాళ్లను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. ప్రతి యూనిట్ భూమికి వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అధిక విలువ కలిగిన పంటలకు వైవిధ్యమైన, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడానికి స్టోరేజ్ చైన్లను అభివృద్ధి చేయాలి. వ్యవసాయ పనితీరును మెరుగు పరచడం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, గ్రామీణాభివృద్ధికి భరోసా ఇవ్వడానికి ఈ సవాళ్లను పరిష్కరించడం అత్యవసరం. నేల క్షీణతను అరికట్టడానికి పర్యావరణ అనుకూల పద్ధతులు పాటించాలి. డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టంలతోసహా సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధ్దతులు అవలంబించాలి. మారుతున్న వాతావరణ విధానాలకు అనుగుణంగా విభిన్న పంట రకాలను సాగు చేసే పద్ధతులను అనుసరించాలి.
వ్యవసాయంతోపాటు వ్యవసాయేతర ఉపాధినీ కలిగి ఉన్న సామాజిక సమ్మిళిత వ్యూహం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించాలి. పైపులద్వారా నీటిని సరఫరా చేయడం, మంచినీటి నిర్వహణ, డ్రిప్ ఇరిగేషన్ వంటి మరింత సమర్థవంతమైన డెలివరీ మెకానిజంలు వంటి చర్యలు తీసుకోవాలి. రసాయన ఎరువుల స్థానే సేంద్రియ ఎరువులను, వ్యవసాయ యంత్రాలను వాడాలి. సమర్థవంతమైన నీటి పారుదల పద్ధతులు, వర్షపునీటి సంరక్షణను అమలు చేయాలి. తుపానులు వంటి వాతావరణ ప్రతికూల సంఘటనల కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అందుబాటులోకి తేవాలి. ఆహారోత్పత్తిని పెంచేందుకు ఎప్పటికప్పుడు నిర్ణయించే ఆహార ధాన్యాల ధరలకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా వారు సహేతుకమైన ఆదాయాన్ని పొందేలా చూడాలి.
పారదర్శక, సరసమైన ధరల విధానాలను ఏర్పాటు చేయాలి. మెరుగైన ధరల ఆవిష్కరణకోసం సమర్థవంతమైన మార్కెట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. రైతులకు ఆర్థిక సహాయం మరింత అందేలా చూడాలి. రైతులు అధునాతన వ్యవసాయ సాంకేతికతలు అంది పుచ్చుకోడానికి డిజిటల్ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించాలి. అలుపెరుగని శ్రామికుల్లా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు బతుకు పోరు సాగిస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తుంటే ప్రభుత్వాలు మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల తీరుతో వారు విరక్తి చెంది ఒక్క సంవత్సరం కాడి పక్కన పడేస్తే 140 కోట్ల జనాభా ఆకలితో అల్లాడ వలసి వస్తుంది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు.
పాలకులు అంగీకరించినా, అంగీకరించక పోయినా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేరకు కారణం. రైతే రాజంటూ తియ్యటి మాటలు చెబుతున్నారు తప్ప, వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదు. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి దేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, సుస్థిరతను ప్రోత్సహించడానికి, ఉత్పాదకతను పెంచడానికి, దేశవ్యాప్తంగా రైతుల జీవనోపాధిని మెరుగు పరచడానికి ఇప్పటికైనా ప్రభుత్వాలు కృషి చేయాలి.
వ్యాసకర్త సెల్: 9440972048