తిరువనంతపురం, అక్టోబర్ 19: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీకి పోటీగా సమఉజ్జీనే బీజేపీ రంగంలోకి దింపింది. ఇంజినీర్‌గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి కోజికోడ్ కార్పొరేషన్‌లో వరుసగా రెండుసార్లు బీజేపీ కౌన్సిలర్‌గా ఎన్నికైన నవ్య హరిదాస్‌ను అభ్యర్థిగా కమలం పార్టీ ప్రకటించింది. కేరళ బీజేపీలో నవ్య క్రియాశీలంగా ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సైతం పనిచేశారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఉన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గెలుపొందగా.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. ఆ స్థానంలో కాంగ్రెస్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంకగాంధీ పోటీ చేస్తున్నారు.