calender_icon.png 30 September, 2024 | 7:58 AM

ప్రియాంక ర్యాలీని అడ్డుకున్నారు

30-09-2024 12:21:34 AM

  1. హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అధికారులు సహకరించలేదు
  2. జేకేపీసీసీ అధికార ప్రతినిధి రవీందర్ శర్మ

జమ్మూకశ్మీర్, సెప్టెంబర్ 29: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా బిల్లావర్ నియోజక వర్గంలో ర్యాలీలో పాల్గొనాల్సిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌ను ఇక్కడి కేంద్రపాలిత అధికారులు కావాలనే అడ్డుకున్నారని జేకేపీసీసీ అధికార ప్రతినిధి రవీందర్ శర్మ ఆరోపించారు.

ఆదివారం మధ్యాహ్నం బిల్వారా, బిష్ణా నియోజకవర్గాల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మనోహర్‌లాల్‌కు మద్దతుగా ప్రియాంక ర్యాలీలో పాల్గొనాల్సి ఉండగా..  జేఅండ్‌కే అధికారులు.. ఆమె హెలికాఫ్టర్ ల్యాండింగ్ స్పాట్‌ను ర్యాలీ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని రవీందర్ శర్మ తెలిపారు. మరోవైపు రాహుల్‌గాంధీ హెలికాఫ్టర్‌లో లోపం కారణంగా ఆయన చాంబ్, రామ్‌గఢ్ నియో జకవర్గాల్లో ర్యాలీల్లో పాల్గొనలేకపోయారు.

కశ్మీరీల గౌరవాన్ని పునరుద్ధరిస్తాం..

బిష్ణాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీజేపీ జమ్మూకశ్మీర్‌ను సంక్షభంలోకి నెట్టిందని అన్నారు. మేము కశ్మీరీల గౌరవాన్ని పునరుద్ధరిస్తాం అని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాతో పాటు 150 ఏళ్ల నాటి దర్బార్ మూవ్ విధానాన్ని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ఇక్కడి ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా నియంతలా పాలిస్తున్నారని.. జేఅండ్‌కేలోని వనరులను లూటీ చేస్తూ బడా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు.