- వయనాడ్‌లో 4.10 లక్షల భారీ మెజార్టీతో విజయం
- అన్న రాహుల్‌గాంధీ రికార్డు చెరిపేసిన చెల్లెలు
న్యూఢిల్లీ, నవంబర్ 23: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విజయఢంకా మోగించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగిన తొలిసారే సత్తా చాటడం విశేషం.
కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన తన సమీప అభ్యర్థి సత్యన్ మొఖేరిపై 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా బీజేపీ నుంచి బరిలో నిలిచిన నవ్య హరిదాస్ 1.09 లక్షల ఓట్లు సాధించారు. ప్రియాంకాగాంధీ(కాంగ్రెస్)కి 6,22,338 ఓట్లు రాగా, సత్యన్(సీపీఐ)కు 2,11,407 ఓట్లు వచ్చాయి.
రాజకీయ ప్రస్థానం
2004లో ప్రియాంక తొలిసారి రాజకీయ అరగేట్రం చేశారు. క్రియాశీల రాజకీయాల్లో లేకపోయినా.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియా, సోదరుడు రాహుల్ తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. యూపీ రాష్ట్రానికి అవతల కొన్ని చోట్ల ర్యాలీల్లో కనిపించారు.
అయితే, ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మాత్రం 2019లోనే.. ఆ ఏడాది జనవరిలో ఆమె ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాతి ఏడాదిలో యూపీకి కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
దేశం దృష్టిని ఆకర్షించి..
2022 చివర్లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంక దేశం దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో తెరవెనుక అన్నీ తానై వ్యవహరించి పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీలో కీలక ప్రచారకర్తగా మారారు. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లోనూ చురుగ్గా పాల్గొని పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సోనియా ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక అరంగేట్రం చేస్తారని ప్రచారం సాగింది. కాగా అనూహ్యంగా రాహుల్ గాంధీ అక్కడి నుంచి బరిలో దిగి విజయం సాధించారు.
వయనాడ్‌పైనే ఫుల్ ఫోకస్
రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌లో ఆయన సోదరి ప్రియాంక పోటీ చేయడంతో కాంగ్రెస్ అధిష్ఠానం మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కంటే వయనాడ్‌పైనే అధిక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఘోరంగా చతికిలపడ్డ కాంగ్రెస్.. 15 సీట్లలోనే విజయం సాధించింది. జార్ఖండ్‌లోనూ అలయన్స్‌తో కలిసి అధికారాన్ని కైవసం చేసుకున్నా కొన్ని సీట్లకే పరిమితమైంది. అయినా వయనాడ్‌లో భారీ ఆధిక్యం లభించడం విశేషం.
పార్లమెంట్‌లో మీ గళాన్ని వినిపిస్తా: ప్రియాంక
వయనాడ్ ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. శనివారం ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత స్పందించిన ఆమె తన విజయం వెన్నంటే ఉన్న తన సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గేను ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు: రాబర్ట్ వాద్రా
వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల ఆమె భర్త రాబర్ట్ వాద్రా హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు శ్రమిస్తారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో ఆమె ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు’ అని మీడియాతో పేర్కొన్నారు.
అన్న రికార్డును అధిగమించి..
2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌లో బరిలో దిగిన రాహుల్.. రెండు చోట్ల విజయం సాధించడంతో వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యం కాగా.. ప్రియాంక గాంధీ పోటీ చేశారు. ప్రచారంలో తన మార్క్‌తో దూసుకెళ్లిన ప్రియాంక తన స్థానికతను ప్రశ్నించిన ప్రతిపక్షాలకు చెక్ పెడుతూ.. ప్రజలు గెంటేసే వరకు వెళ్లిపోను అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
మహిళ, యువత సమస్యలను ప్రధానంగా ఎత్తిచూపుతూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీ కంటే ప్రియాంక అధిక మెజార్టీ(4లక్షల ఓట్ల పైచిలుకు) సాధించడం విశేషం.