calender_icon.png 23 October, 2024 | 4:56 PM

నేను.. నా కోసం ప్రచారం చేస్తున్నాను: ప్రియాంక గాంధీ

23-10-2024 02:02:03 PM

న్యూఢిల్లీ: తొలిసారి తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. వయనాడ్ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో తొలిసారి తన కోసం ప్రచారం చేసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. కేరళలోని వాయనాడ్‌లో పార్లమెంట్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు ఆమె బహిరంగ సభలో ప్రసంగించారు. వయనాడ్ సీటుకు గతంలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించగా, ఈసారి కూడా విజయం సాధించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానాన్ని నిలుపుకున్నారు. వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. 

"నేను మా నాన్న (మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) కోసం ప్రచారం చేసినప్పుడు నాకు 17 ఏళ్లు. ఆ తర్వాత నేను మా అమ్మ, సోదరుడు, నా సహోద్యోగుల కోసం ప్రచారం చేశాను. 35 సంవత్సరాలుగా నేను వేర్వేరు ఎన్నికలలో ప్రచారం చేస్తున్నాను, అయితే నేను ఇదే మొదటిసారి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం నాకు చాలా భిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. మీరు నాకు అవకాశం ఇస్తే మీ తరపున ప్రాతినిధ్యం వహించడం నా గౌరవం." అని ప్రియంకా గాంధీ పేర్కొన్నారు.