న్యూఢిల్లీ: పార్లమెంట్ లో ప్రజల తరుపున గళాన్ని వినిపించేందుకు ఎదురుచూస్తున్నానని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఎక్స్‌లో ప్రియాంక గాంధీ పోస్ట్ చేశారు. 'నా గెలుపు మీ విజయమే' అంటూ వయనాడ్ ఓటర్లను ఉద్దేశించి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఉప్పొంగిపోతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని చెప్పిన ప్రియంక గాంధీ తన తల్లి, భర్త, పిల్లలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. తన వెనుక ఉండి నడిపించినందుకు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
తొలిసారి ప్రత్యేక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీకి వయనాడ్ ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారు. కేరళ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ 2024 రికార్డును వయనాడ్‌లో 3.65 లక్షల ఓట్ల తేడాతో అధిగమించారు. ఇప్పటి వరకు ఆమెకు 6 లక్షల ఓట్లు వచ్చాయి. గతంలో తన సోదరుడు రాహుల్‌గాంధీ నిర్వహించిన స్థానాన్ని ప్రియాంక నిలబెట్టుకోనున్నారు. ఇదిలా ఉంటే, పాలక్కాడ్ స్థానం ఉపఎన్నికల తొలి రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న బిజెపి అభ్యర్థి సి కృష్ణకుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్‌కూటతిల్ 18,840 ఓట్ల తేడాతో విజయం సాధించారు.