calender_icon.png 24 October, 2024 | 5:54 AM

వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్

24-10-2024 03:53:52 AM

హాజరైన సోనియా, 

రాహుల్, ఖర్గే

తెలంగాణ నుంచి 

సీఎం రేవంత్, 

డిప్యూటీ సీఎం భట్టి హాజరు

మొదటిసారి ఎన్నికల్లో 

పోటీ చేస్తున్న ప్రియాంక

వయనాడ్, అక్టోబర్ 23: కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ బుధవారం వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. నామినేషన్ అనంతరం ప్రియాంక తన రాజకీయ ప్రస్థా నం గురించి మాట్లాడారు. 1989లో నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు నా తండ్రి రాజీవ్‌గాంధీ కోసం ప్రచారంలో పాల్గొన్నా. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో నా తల్లి, నా సోదరుడు, ఇతర సహచరుల కోసం ప్రచారం చేశా. నా కోసం ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. వయనాడ్‌లో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మద్దతునిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఇక్కడి ప్రజలు అవకాశమిస్తే వారికి ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తా అని ప్రియాంక పేర్కొన్నారు. 

ప్రియాంక ఆస్తి రూ. ౧౨ కోట్లు

అఫిడవిట్‌లో 

వివరాలు వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ప్రియాంక గాంధీ పేరిట రూ.12 కోట్లు, భర్త రాబర్ట్ వాద్రా పేరు మీద రూ.65 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు. 2023 ఆర్థిక సంవత్సరంలో అద్దె, ఇతర పెట్టుబడులతో కలిపి మొత్తం రూ. 46.39 లక్షల ఆదాయం పొందినట్టు చెప్పారు. ఆస్తుల్లో రూ.4.25  చరాస్తులు ఉండగా.. స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లు ఉన్నట్టు ప్రకటించారు. లగ్జరీ కార్లు, రూ.1.15 కోట్లు విలువ చేసే బంగారంతోపాటు హిమాచల్ ప్రదేశ్‌లో రూ. 5.63కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటితోపాటు రూ.15.75కోట్ల వరకు అప్పులు ఉన్నట్టు వివరించారు. 

ఇద్దరు ఎంపీలం ఉన్నాం: రాహుల్

వయనాడ్‌లో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి 400 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఈ సందర్భంగా ప్రియాంక గుర్తుచేశారు. తన కళ్లతో వినాశనాన్ని చూశానని, కుటుంబాలను కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లులను కలిశానని చెప్పారు. ప్రియాంక నామినేషన్ సందర్భంగా రాహుల్‌గాంధీ ప్రియాంక విజయంపై ధీమా వ్యక్తం చేశారు. వయనాడ్‌కు అధికారికంగా ఒకరు, అనధికారికంగా ఇద్దరు ఎంపీలు ఉంటారు. మేమిద్దరం లోక్‌సభలో మీ సమస్యలను లేవనెత్తుతాం అని రాహుల్ పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ 3.6 లక్షల ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ ఆయన గెలవడంతో వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వయనాడ్‌లో లోక్‌సభ ఉప ఎన్నిక నవంబర్ 13న జరగనుండగా 23న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలను వెల్లడించనున్నారు.