calender_icon.png 24 October, 2024 | 5:32 AM

ప్రియాంకకు గట్టి పోటీయే!

24-10-2024 04:08:19 AM

బలమైన అభ్యర్థులను 

బరిలోకి దింపిన బీజేపీ, సీపీఐ

టెకీగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన నవ్య హరిదాస్

ప్రియాంకకు పోటీగా దింపిన బీజేపీ

సీపీఐ నుంచి బరిలో సీనియర్ నేత సత్యన్ మొకేరి

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: కేరళలోని వయనాడ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రాజీనామాతో వయనాడ్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంకగాంధీ బరిలో నిలిచారు.రళలోని వయనాడ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రాజీనామాతో వయనాడ్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంకగాంధీ బరిలో నిలిచారు. వయనాడ్ కాంగ్రెస్‌కు సేఫ్ సీట్‌గా భావించి ప్రియాంకను ఆ పార్టీ పోటీలో నిలిపింది. వయనాడ్‌లో రాజకీయ అరంగేట్రం చేస్తున్న ప్రియాంకకు పోటీగా ప్రత్యర్థులు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. క్రియాశీలంగా పని చేస్తోన్న కోజికోడ్ కౌన్సిలర్ నవ్య హరిదాస్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించగా.. సీనియర్ నేత సత్యన్ మొకేరిని సీపీఐ బరిలోకి దింపింది. వీరిద్దరూ స్థానికంగా గట్టి పట్టు ఉన్న నేతలు కావడంతో వయనాడ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా, రాహుల్‌ను రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ కంచుకోటగా మారిన వయవాడ్‌ను రాహుల్ వదులుకోవడం, ఆ తర్వాత ఆయన సోదరి ప్రియాంక పోటీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గాంధీ కుటుంబం దక్షిణాదిని విస్మరించిందనే విమర్శల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి.

ప్రియాంకపై పోటీకి బీజేపీ పెద్ద ఎత్తుగడే వేసింది. టెకీగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన నవ్య హరిదాస్‌ను ప్రియాంకపై పోటీ కి దింపింది. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన నవ్య.. కోజికోడ్ కౌన్సిలర్‌గా, బీజేపీ మహిళా మోర్చా చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవ్యకు తక్కువ అనుభవమే ఉన్నా ప్రజల్లో ఆమెపై మంచి అభిప్రాయం ఉండటంతో బీజేపీ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేరళలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ సెగ్మెంట్‌లో పోటీ చేసిన నవ్య.. ఓడిపోయినప్పటికీ అక్కడ రికార్డు స్థాయిలో బీజేపీకి ఓటు శాతాన్ని పెంచారు. నవ్యకు టికెట్ ఇవ్వడమే ఆలస్యమన్నట్టు ప్రియాంకపై విమర్శ లు ఎక్కుపెట్టారు. గాంధీ కుటుంబానికి వయనాడ్ కేవలం రెండో సీటు మాత్రమేనని ఆరోపించారు. వరదల సమయంలో 400 మంది మరణించినా అప్పుడు ఎంపీగా ఉన్న రాహుల్‌గాంధీ ఏం చేశారని నిలదీశారు. 

సీపీఐకి బలమైన గళంగా..

సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరి కేరళ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. కేరళ అసెంబ్లీలో ఆయనను గర్జించే సింహంగా వ్యవహరిస్తారు. సీపీఐకి బలమైన గళంగా పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధులు కేలప్పన్‌నాయర్, కల్యాణి మొకేరి దంపతులకు జన్మించిన ఆయన ఏఐఎస్‌ఎఫ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1987 నుంచి 2001 వరకు నాదాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యదర్శితో పాటు సీపీఐలో పలు జాతీయ స్థాయి పదవులను చేపట్టారు. ప్రస్తుతం ప్రియాంకగాంధీ ఓటమే లక్ష్యంగా బీజేపీ, సీపీఐ బలమైన అభ్యర్థులను నిలబెట్టింది.