calender_icon.png 2 October, 2024 | 4:10 AM

బల్లి పాత్రకు ప్రియదర్శి డబ్బింగ్ చెప్పారు

02-10-2024 12:44:31 AM

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేశ్ అగస్త్య నటిస్తున్న సినిమా ‘కలి’. హీరోయిన్‌గా నేహా కృష్ణన్ నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వంలో లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న విడులవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

“జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని మా ‘కలి’ మూవీలో చెబుతున్నాం. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70 శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. మెత్తగా ఉండేవాడిని సొసైటీ ఆడుకుంటుంది. ఈ చిత్రంలో ప్రిన్స్ చేసిన శివరామ్ క్యారెక్టర్ అతి మంచితనంతో వచ్చిన సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు.

ఆ సమయంలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తిగా నరేశ్ అగస్త్య క్యారెక్టర్ వచ్చాక శివరామ్ లైఫ్‌లో జరిగిన ఘటనలు ఏంటి? అనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. బల్లి పాత్రకు ప్రియదర్శి డబ్బింగ్ చెప్పారు. కలి సినిమాకు కల్కి మూవీకి సంబంధం లేదు. మేము ముందు నుంచీ ఈ టైటిల్‌నే పెట్టుకున్నాం. కల్కికి ఫస్ట్ ప్రాజెక్ట్ కె అనే టైటిల్ ఉండేది. సమయాన్ని, ఆత్మను ఆధారం చేసుకుని ఈ యుగాన్ని ప్రభావితం చేసే కలిని మా కథలో ఎలా చూపించామో థియేటర్స్‌లో చూడండి” అన్నారు.