calender_icon.png 25 October, 2024 | 5:01 AM

‘డార్లింగ్’.. వై దిస్ కొలవెరి

19-07-2024 04:31:08 PM

చిత్రం: డార్లింగ్;


నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల, మురళీధర్‌గౌడ్ తదితరులు;


సంగీతం: వివేక్ సాగర్;


సినిమాటోగ్రఫీ: నరేశ్ రామదురై;


మాటలు: హేమంత్;


రచన అశ్విన్ రామ్;


నిర్మాతలు: కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి;


విడుదల: 19

(ఇంట్రో..) ఒక వ్యక్తి విభిన్న వ్యక్తిత్వాలను కలిగి ఉండడం (స్ప్లిట్ పర్సనాలటీ) అన్నది ఆసక్తికరమైన కథాంశమే. నేపథ్యాలు వేరైనప్పటికీ ఈ కోవలో గతంలో వచ్చిన చంద్రముఖి, అపరిచితుడు వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా అలాంటి డిజార్డర్ కథతోనే తెరమీదికొచ్చిన ‘డార్లింగ్’ సినిమా.. ప్రేక్షకులతో ఎలా ‘కమ్యూనికేట్’ చేసింది. ఎంతలా ‘ఎంగేజ్’ చేసింది.. అనేవి తెలుసుకునేందుకు లెట్స్ ‘గెట్ ఇన్ టు ది ప్రాసెస్’.


మెయిన్ క్యారెక్టర్


ప్రియారావు (నభా నటేష్): పారిస్లోని సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ.. పంజరంలో బతుకుతున్నట్టు భావించే అమ్మాయి

మ్యాడ్ క్యారెక్టర్స్


ఆనంది: చిన్నతనంలో లైంగిక వేదింపులకి గురై.. ఎదిగాక తనకు నచ్చిన వాడితో బతకాలనుకుంటుంది


ఆది: ఆనందికి ఏ కష్టం రాకుండా చూసే సేవియర్


ఝాన్సీ: ఆడోళ్లను అణగదొక్కబడుతున్నారని భావించే ఓ మహిళ


శ్రీశ్రీ: బంధాలకు దూరం కమ్మంటూ వేదాంతం వల్లిస్తూ..


పాప: ఒంటరితనం నుంచి బయటపడాలనుకుంటూ.. తన ఇష్టాలు తీర్చాలనుకునే స్వభావం


మాయ: అసహాయరాలిగా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం


ప్రధాన పాత్రలో ఈ పిచ్చి పాత్రలన్నీ ఉండడం అనే అంశంతో కథ సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు అశ్విన్ రామ్. ఇలాంటి క్లిష్టమైన అంశానికి కామెడీ టచ్ ఇచ్చి తద్వారా ప్రేక్షకులకు ఓ ‘మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్’ అందించాలన్నది అతడి ఆలోచన. అయితే ఎక్కడో పారిస్‌లో ఉన్న అమ్మాయికి ఇలాంటి పాత్రలన్నీ ఎలా పరిచయమయ్యాయి. ఒకవేళ అవన్నీ తన అనుభవాల నుంచి వచ్చినవి అయితే అవి తెరపై నుంచి ప్రేక్షకులకు కమ్యూనికేట్ కాలేదన్నది సుస్పష్టం.


కుటుంబ, సామాజిక పరంగా స్త్రీలకు ఎదురయ్యే సమస్యలు.. వాటి పర్యవసానాలను తెరపై చూపించడం దర్శకుడి ఉద్దేశమైతే.. వీటిని ప్రస్తుత సమాజంలో సున్నిత అంశాలుగా పరిగణిస్తారు. పాత్రల పరంగా చూసుకుందామన్నా వారి బాధ ఏమిటో తెలిసినపుడే కదా ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకునేది. ఫలితంగా ఆయా పాత్రలతో ‘ఎంగేజ్’ అయ్యేది. మన దగ్గర డబ్బు లేనపుడు ఒకరి పర్స్ నుంచి లాక్కోవడం..? (ఫోర్స్డ్), అదే మనం అడిగి, అవతలి వాళ్లు ఇస్తే.. అది అర్థం చేసుకోవడం.. సహానుభూతి చెందడం. ఇక్కడ జరగనిది అదే. ప్రేక్షకులు ఏ పాత్రతోనూ పూర్తిగా ఎంగేజ్ అయ్యే పరిస్థితి లేదు.


పోనీ రాఘవ పాత్ర (ప్రియదర్శి)తో అయినా రిలేట్ అవుదామనుకుంటే... పెళ్లాంతో పారిస్ వెళ్లాలన్నది అతడికి చిన్ననాటి నుంచి గల ఏకైక కల. అది జరగడం లేదన్న అసహనంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు. రాఘవలా పారిస్ వెళ్లడం లాంటి ఆలోచనలు ఊహలో కూడా లేని మామూలు ప్రేక్షకులు అతనితో ఎలా కనెక్ట్ అవుతారు? తర్వాత ఆ కల ఏదో ఫలించేలా ఉంది అనుకుంటే.. అక్కడి నుంచి ఒకే రూపంతో వచ్చిన అనేక పాత్రలు సినిమాలోని రాఘవతోపాటు చూస్తున్న ప్రేక్షకులను కూడా కంగారుపెడతాయి. అయితే ఆనందికి ఆదిలా.. నటుడిగా దర్శి ఈజ్ సేవియర్ ఫర్ డార్లింగ్.


సినిమాని నడిపేందుకు దర్శకుడు తను అనుకున్న ప్రాసెస్‌తో గెట్ ఇన్ అయిపోయాడు. కథ నడవడికను పాత్రలను బట్టి గాని, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని గాని రాసినట్టు అనిపించదు. ఫస్ట్ ఆఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో నవ్వు పుడుతుంది. అయితే బాబాగా వేణు, సెకెండాఫ్‌లో సీరియల్ని తలపించే పిన్ని పాత్రలతో నవ్వులు తెప్పించే ప్రయత్నం ఫలించలేదు. హీరోయిన్‌ను కాపాడాలనుకునే సమయంలో అలాంటి సన్నివేశాలు నిడివి పెంచడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. అనన్య నాగళ్ల అలియాస్ నందిని సైకియాట్రిస్ట్ అయ్యుండీ.. రాఘవ లాంటి వ్యక్తిని కాదని మరో వ్యక్తిని వివాహమాడుతుంది. ఆ పాత్ర గొప్పతనమేమిటో దర్శకుడికే తెలియాలి. బ్రహ్మానందం సినిమాలో ఉన్నారని గుర్తుపెట్టుకునే ఒక్క సన్నివేశం కూడా ఉండదు. మిగిలిన నటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయాలు లేవు. పాత్రల పరిధి మేర పని కానిచ్చారు. వివేక్ సాగర్ పాటల్లో ‘రాహిరే’, ‘సున్ చెలియా’ వినడానికి బాగున్నాయి. రాసిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అభినందించదగ్గదే. ‘కలాసే’ పాట ‘గ్లాస్ మేట్స్’ పాటను గుర్తు చేస్తుంది. పాటల సందర్భం ఇంకాస్త బలంగా ఉండాల్సింది. నేపథ్యం సంగీతం అంతగా ఆకట్టుకోదు. కమ్యూనికేట్ ఎంగేజ్- గెట్ ఇన్ టు ది ప్రాసెస్ అని సినిమాలో చాలా సార్లు చెప్పుకొచ్చిన దర్శకుడు, ఇదే ఫార్ములాను కథకు అన్వయించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో! ఇప్పటికైతే వై దిస్ కొలవెరి డార్లింగ్ అన్నట్టే ఉంది.


డార్లింగ్.. డిస్సపాయింట్ చేసిన డిజార్డర్


రిపోర్టర్: సత్యప్రసాద్