calender_icon.png 24 October, 2024 | 2:49 AM

చాపకింద నీరులా ఆర్టీసీ ప్రైవేటీకరణ!

24-10-2024 12:22:19 AM

  1. అతీగతీలేని విలీన ప్రక్రియ, ఉద్యోగ నియామకాలూ లేవు
  2. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లు కావాలంటూ ఆటోలపై ప్రకటనలు
  3. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు
  4. ప్రైవేటీకరణకు వ్యతిరేకగా ఆందోళనకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ
  5. ప్రైవేటీకరణపై గతంలోనే హెచ్చరించిన ‘విజయక్రాంతి

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీ సీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 నెలలైనా ఆ ఊసెత్తడం లేదు. విలీనం మాట పక్కనబెట్టి కనీసం ఆర్టీసీ ఉనికినైనా ఉండనిస్తే చాలనేలా పరిస్థితి మారింది.

గడిచిన 10 నెలల్లో ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నియామకం కూడా చేపట్టని యాజమాన్యం, ప్రైవేట్ వ్యక్తులను ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లుగా నియమించేందుకు నగరంలో ఆటోలపై బాజాఫ్తా ప్రకటనలు ఇస్తోంది.

తన సొంత ట్రైనింగ్ కాలేజీ ద్వారా నైపుణ్యమున్న ఉత్తమ డ్రైవర్లను తయారు చేసి, అపార అనుభవం ఉన్న ఆర్టీసీని కాదని ఓ అనామక ప్రైవేట్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల కొరకు డ్రైవర్లు కావలెననే ప్రకటనలు ఆర్టీసీ కార్మికులను మనోవేదనకు గురిచేస్తున్నా యి. ఇక కొత్త బస్సుల పేరిట అన్నీ ఈవీ అద్దె బస్సులను ప్రవేశపెడుతున్నారు.

ఈ పరిస్థితులన్నింటినీ చూసిన కార్మికులు ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం, యాజమాన్యం అడుగులు వేస్తున్నాయని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రైవేటీకరణ విధానాలపై ఈ నెల 7న విజయక్రాంతి దినపత్రికలో కథనం వెలువడిన సంగతి విధితమే.

వాంటెడ్ డ్రైవర్స్..

ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు కావాలంటూ ఓ సంస్థ నగరంలో ఆటోల వెనక ప్రకటనలు ఇస్తోంది. ఓ వైపు 3 వేల నియామకాలు చేపడతామంటూ ఆర్టీ సీ యాజమాన్యం, సంబంధిత మంత్రి ప్రకటనలు చేస్తున్నా.. ఇప్పటివరకు జరగలేదు. దశలవారీగా ఆర్టీసీలో కార్మికులు పదవీవి రమణలు చేస్తున్నా.. వారి స్థానాల్లో కనీసం ఒక్కరిని కూ డా నియమించలేదు.

డొక్కు బస్సులను స్క్రాప్ కింద తీసేస్తున్నా కొత్త బస్సులను ప్రవేశ పెట్టని ఆర్టీసీ.. ఆగమేఘాల మీద ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈవీ బస్సులను తీసుకొస్తోంది. వీటికి డ్రైవర్, కండక్టర్ కూడా ప్రైవేట్ వ్యక్తులనే నియమిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. చాపకిందనీరులా ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడం కోసమే ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను తెరమీదకు తెచ్చిందని కార్మికులు వాపోతున్నారు.

ఆర్టీసీకి అవసరమైన పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల కొనుగో ళ్లను తొక్కిపెట్టి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను అద్దె బస్సులుగా ఆర్టీసీకి అంటగడుతోందని తెలిపారు. వారికి చెల్లించే అద్దె కూడా ఆర్టీసీకి ఏ మాత్రం లాభదాయకం కాకపోగా ఉన్న ఆస్తులమ్మి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల్ని పెంచి పోషించాల్సిన పరిస్థితిని ఆర్టీసీకి ప్రభుత్వపెద్దలు కల్పిస్తున్నా రని కార్మికులు వాపోతున్నారు.

వీటికి బదులుగా సర్కారే ఆర్టీసీకి ఈవీ బస్సులను కొను గోలు చేసి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అర్హతలు లేని వ్యక్తులను తీసుకొచ్చి బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రా ణాలను ఫణంగా పెట్టొద్దని కోరుతున్నారు.

కార్యాచరణకు సిద్ధమైన జేఏసీ

ఆర్టీసీని ఆగం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని గుర్తించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేశారు. నవంబర్ 5న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేయనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున కార్మికులందదూ చలో సెక్రటేరియేట్ ద్వారా తమ ఆందోళనను ప్రభుత్వా నికి తెలియజేయాలని భావిస్తున్నారు. యూ నియన్లన్నీ ఐక్యంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రైవేటీకరణ నుంచి కాపాడు కుంటామని కార్మికులు చెబుతున్నారు.

తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, మిగతా డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. కార్మి కులను తడిగుడ్డతో గొంతు కోసింది. గత ప్రభుత్వానికంటే ఘోరంగా ఆర్టీసీని నాశనం చేస్తోంది. సాక్షాత్తు మంత్రులు వెళ్లి ప్రైవేట్ బస్సులను తమవన్నట్లుగా ప్రారంభించి, ప్రచారం చేసుకోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రైవేట్ ఈవీ బస్సులను రద్దు చేసి తామే సొంతంగా కొనుగోలు చేసి ఆర్టీసీకి  అప్పగించాలి.

ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్

ఆర్టీసీని నాశనం చేసే కుట్ర..

ఈ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. ఆర్టీసీని విలీనం చేసుకుంటా మని హామీఇచ్చి కార్మికులు రిటైరవుతున్నా కనీసం ఇప్పటివరకు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను ఈవీ డ్రైవర్లుగా నియమిస్తున్నారు. ఆటోలపై డ్రైవర్లు కావాలంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ఆగం చేయాలని చూస్తే ఊరుకోం. దశలవారీగా ఉద్యమ కార్యాచరణను ప్రారంభిస్తాం.

థామస్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్