- వాటి కార్యకాలపాలు ఆర్టీసీయే చూస్తోంది
టీజీఎస్ ఆర్టీసీ స్పష్టీకరణ
హైదరాబాద్, జనవరి22 (విజయక్రాంతి): ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్, చార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తీసుకొస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారం హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
2023 మార్చిలో నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 550 ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులకు, 500 సిటీ బస్సులకు సొంత టెండర్ ద్వారా ఆర్డర్ ఇచ్చినట్లు ఆర్టీసీ తెలిపింది. వాటిలో 170 సిటీ, 183 జిల్లాల బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని.. ప్రైవేట్ సంస్థల జాప్యం వల్ల మిగతా ఎలక్ట్రిక్ బస్సులు రావడంలో ఆలస్యమవుతుందని వివరించింది.