20-02-2025 01:08:53 PM
ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్ళిన బస్సు
రాజేంద్రనగర్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్షా కోట్ లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టుకుంటూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం తో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను క్లియర్ చేస్తున్నారు. అయితే అతి వేగంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎలాంటి ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈమెరకు నార్సింగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.