- సీసీఐ కేంద్రాల ఏర్పాటులో జాప్యం
- అమ్మకానికి అన్నదాతల అగచాట్లు
కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): పత్తి రైతుల కష్టం ప్రవేట్ కంపెనీలపాలు అవుతున్నది. ఆరుగాలం కష్టపడటం రైతు వంతు అయితే లాభం మాత్రం ప్రైవేట్ కంపెనీలు పొందుతున్నాయి. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తుండటంతో మధ్య దళారుల దందా పత్తి రైతులను నిలువునా ముంచుతున్నది. పత్తిని నిల్వ పెట్టుకునేందుకు స్థలం లేక అతి తక్కు వ ధరకే రైతులు ప్రవేట్ కంపెనీలకు అమ్ము తూ నష్టపోతున్నారు.
ధర తగ్గినా ప్రైవేటు వైపే మొగ్గు
కామారెడ్డి జిల్లాలో పత్తి పంటను సీసీఐకి అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాలతో పోలిస్తే ప్రైవే ట్ వ్యాపారులు రూ.5 వేల వ్యత్యాసంతో కొంటున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో ప్రైవేట్ పత్తి మిల్లులు 8 ఉన్నాయి. సీసీఐ క్వింటాలు పత్తికి రూ.7,521 ధర ప్రకటించింది. ప్రైవేట్ కంపెనీ వారు క్వింటాలుకు రూ.7,120 వరకు చెల్లిస్తున్నారు.
అయితే సీసీఐకి అమ్మితే రైతులకు సకాలంలో డబ్బు లు రావని ప్రైవేట్ కంపెనీలకు విక్రయిస్తే డబ్బులు వెంటనే వస్తాయని ధర తక్కువ అయినా ప్రైవేట్ కంపెనీలకే అమ్మేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ పత్తి కంపెనీలు కమీషన్ ఏజెంట్లను నియమించుకుని గ్రామాల్లో పత్తి చేతికి రాకముందే రైతు లకు అడ్వాన్స్ చెల్లించి తమకే అమ్మేలా వ్యవహరిస్తున్నారు.
మరికొందరు పత్తి విత్తనాలు నాటే సమయానికి ముందే అడ్వాన్స్ చెల్లించచి తమకే విక్రయించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత రూ.200 నుంచి రూ.500 వరకు ధర తగ్గించి కొంటున్నారు. ఇలా తాడ్వాయి, గాంధారి, లింగంపే ట్, పిట్లం, చిన్నకొడపగల్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్, జుక్కల్, మద్నూర్ మండలాల్లోని పత్తి రైతులను ప్రైవేట్ వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు.
కమీషన్ ఏజెంట్లు రైతులకు క్వింటాలు పత్తి రూ.6,500 నుంచి రూ.7 వేల వరకు చెల్లిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని మద్నూర్ సీసీఐకి తరలించి ఏజెంట్లు, వ్యాపారులు భారీగా లాభాలు పొందుతున్నారు.