calender_icon.png 28 September, 2024 | 2:53 AM

ప్రైవేటు హాస్టళ్లు.. సమస్యల సాలెగూళ్లు

27-09-2024 02:43:21 AM

విద్యార్థుల జేబులకు చిల్లు.. వసతులు నిల్లు

మహానగరంలో హాస్టల్ యాజమాన్యాల దోపిడీ

నిబంధనల ఉల్లంఘన, బల్దియా ప్రమాణాలపై నిఘా

త్వరలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు దిశగా అడుగులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2౬ (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో కుప్పలు తెప్పలుగా ప్రైవేట్, వర్కింగ్ మెన్స్, వర్కింగ్ ఉమెన్స్  హాస్టళ్లు పుట్టుకొస్తున్నాయి.ఎడ్యుకేషన్ హబ్ అయిన నగరంలో కొం దరు నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ భవనాల్లో నిర్వహిస్తున్నారు. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్ని వర్కింగ్ హాస్టళ్లు ఉన్నాయనే లెక్కలు సైతం బల్దియా అధికారుల వద్ద లేకపోవడం విచిత్రం.

వాస్తవానికి హాస్టళ్ల ఏర్పాటకు సర్కిల్ స్థాయిలో అనుమతులు వస్తుండగా, వాటి గురించి తమకు అవసరం లేదనే తీరులో బల్దియా అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. హాస్టళ్ల యాజమాన్యాలు విద్యార్థులను ఇరుకైన గదుల్లో ఉంచుతుం డడం, నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో హాస్టల్ యాజమా న్యం ఒక్కో వ్యక్తి నుంచి సగటున రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తూ వారికి కనీసం వసతులైనా కల్పించడం లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ హాస్టల్ సెల్లార్‌లో వరద నీరుచేరి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న పలువురు అభ్యర్థులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో హైదరబాద్ బల్దియా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రైవేట హాస్టళ్లలో వసతులను చెక్ చేయాల్సిన అవసరం ఉంది. 

రెసిడెన్షియల్ భవనాల్లో వ్యాపారం

గ్రేటర్ పరిధిలో నడుస్తున్న ప్రైవేట్ హాస్టళ్లలో సింహభాగం అపార్ట్‌మెంట్స్, రెసిడెన్సి యల్ భవనాల్లోనే నడుస్తున్నాయి. ఒక్కో హాస్టల్ యాజమాన్యం ఒక్కో గది వైశ్యాలం, బెడ్ రూం పరిధిని బట్టి విద్యార్థులకు కేటాయిస్తున్నాయి. ఒక్కో బెడ్ రూంకు సుమారు ఐదుగురు, హాల్‌లో అయితే 10 మంది  ఉండేలా అడ్మిషన్లు ఇస్తున్నాయి. డబుల్ బెడ్ రూం వంటి రెసిడెన్షియల్ అయితే ఏకంగా 15 20 మంది ఉండేలా చేర్చుకుంటున్నాయి. అయితే.. వీరికి కావాల్సిన టాయిలెట్స్ సౌకర్యం, నీటి వసతి, పరిశుభ్రత, వెంటిలేషన్ తదితర వసతులను హాస్టళ్లు కల్పించడంలేదనే విమర్శలున్నాయి.

ఎడ్యుకేషన్ ఇనిస్టిస్ట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు అత్యధికంగా ఉండే అశోక్ నగర్, అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్, మాదాపూర్, నారాయణగూడ, మెహి దీపట్నం, బేగంపేట, ఉప్పల్, ఎల్బీ నగర్, సుచిత్ర  తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ హాస్టల్స్ ఎక్కడ పడితే అక్కడ వెలిశాయి. కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండే అశోక్‌నగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో 30 ఫ్లాట్లు ఉంటే, 18 ఫ్లాట్లలో హాస్టళ్లు నడుపుతున్నారు.

ఇక్కడ నిబంధనలు పాటించరనేది బహిరంగ రహస్యం. బల్దియా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, హాస్టళ్లను పరిశీలించి ఒక డ్రాప్ట్‌ను సిద్ధం చేశారని తెలిసింది. ఇప్పటికే ఫైల్ కమిషనర్ అమ్రపాలికి చేరిందని సమాచారం. ఉత్తరాది పర్యటనలో ఉన్న మేయర్ విజయలక్ష్మి ఇక్కడికి రాగానే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని హెల్త్, శానిటేషన్, ఫైర్ విభాగాల అధికారులతో ఓ టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.