ఒకదాని నుంచి మరో ఆస్పత్రికి రెఫర్
పరిస్థితి విషమించి గర్భిణి మృతి
- నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘటన
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యానికి మూడు నెలల గర్భిణి మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. తెలకపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందిన రాములమ్మ(35) మూడు నెలల గర్భిణి. బుధవారం చేతులు, కాళ్లు తిమ్మిర్లు రావడంతో ఆమె భర్త మల్లేశ్ జిల్లా కేంద్రంలోని శివ నర్సింగ్‌హోమ్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో సుమారు మూడున్నర గంటలపాటు నిరీక్షణ తర్వాత పరీక్షించి గంటపాటు వైద్యం చేశారు.
అనంతరం పరిస్థితి విషమంగా ఉందంటూ మరో ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ కూడా వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో మరో ఆసుపత్రికి వెళ్లాలని ఫోన్ ద్వారా చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులు పరీక్షించి బీపీ, షుగర్ కంట్రోల్ లేదంటూ వైద్యం ప్రారంభించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వెంటిలేటర్ అవసరం పడుతుందంటూ జిల్లా కేంద్రంలోని గాయత్రి ఆసుపత్రికి రెఫర్ చేశారు.
అక్కడి వైద్యులు పరీక్షించి వెంటిలేటర్ ఖర్చుల వివరాలు చెప్పారు. ఆ ఖర్చులు భరించలేమంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు రాములమ్మ మృతిచెందింది. రాములమ్మ మృతికి ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యమే కారణమంటూ రాఘవేంద్ర ఆసుపత్రి ఎదుట బంధువులు ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ వైద్యాధికారి వెంకటదాసు రాఘవేంద్ర ఆసుపత్రిని సందర్శించారు. బాధితులు, వైద్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు.