- గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుల నిర్వాకం
- ఆస్పత్రిలో వసతులు లేవని, తమ దవాఖానలకు రావాలని సూచనలు
- డయాగ్నోస్టిక్ సెంటర్లతో డ్యూటీ డాక్టర్ల కుమ్మక్కు
గజ్వేల్, నవంబర్ 18: గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. దీన్ని కాంట్రాక్ట్ వైద్యులు తమ వ్యాపారానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం గజ్వేల్ దవాఖానలో రోజుకు 900 నుంచి వెయ్యి మందికి వైద్యసేవలు అందిస్తున్నారు.
వీరిలో గర్భిణులు, బీపీ, షుగర్‌లతో ఇబ్బంది పడేవారు అధికంగా ఉంటారు. గర్భిణులకు స్కానింగ్ చేసే సిబ్బంది ఆసుపత్రిలోని స్కానర్‌లో సరిగా పనిచేయడం లేదని తమ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వస్తే మెరుగైన సేవలు అందిస్తామంటూ సలహాలిస్తున్నారు.
బీపీ, షుగర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో పరీక్షల కోసం వచ్చే పెషెంట్లను మరో వైద్యురాలు అవసరం లేకున్నా 2డీ ఈకో స్కానింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు జనాలు ప్రైవేట్ దవాఖానలు, ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకొని జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
గర్భిణుల స్కానింగ్ కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపుతున్నారని పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా అధికారులు నామమాత్రపు చర్యలు చేపట్టి వదిలేయడంతో తిరిగి అదే పునరావృతమవుతోంది. డ్యూటీలో ఉండే వైద్యులు కూడా డయాగ్నోస్టిక్ సెంటర్లతో లోపాయికారి ఒప్పందం చేయించుకొని రోగులకు ఆయా కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి దోపిడీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.