- దర్జాగా ధాన్యం కొంటున్న వ్యాపారులు
- వచ్చే వారు లేరు.. చూసేవారు లేరు
- నష్టపోతున్న అన్నదాతలు
మంచిర్యాల, నవంబర్ 19 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారులు దర్జాగా దందా చేస్తున్నారు. రైతుల నుంచి యథేచ్ఛగా ధాన్యం కొంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రారంభించిన కేంద్రంలోనూ ఇదే తీరు కొనసాగడం గమనార్హం. కనీసం కల్లాల్లో పోసిన ధాన్యం ఏ రోజు ఎవరు తీసుకొచ్చారు, ధాన్యం తేమ శాతం ఎంత వచ్చిందో చూసేవారు లేరు.
కలెక్టర్ ప్రారంభించినా అంతే..
మంచిర్యాల కలెక్టరేట్‌కు రెండు కిలో మీటర్ల దూరంలోని నస్పూర్ మున్సిపాలిటీ సీతారాంపల్లి రైతు వేదిక వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్‌తో కలిసి స్వయంగా ప్రారంభించారు. ఆ రోజు కనిపించిన అధికారులు, కేంద్రం నిర్వాహకులు నేటి వరకు దిక్కు లేరు.
వారి కోసం ఎదురు చూడటం రైతుల పని అయిపోయింది. దీంతో చేసేదేమీ లేక తక్కువ ధరకే ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారు. అధికారుల పట్టింపులేని తనం దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు వరంగా మారింది. ఆరిన ధాన్యం కల్లాల్లో రోజుల తరబడి ఉంటుండటంతో రైతుల వద్దకు వెళ్లి ధర మాట్లాడి లారీలను తెప్పించి పట్టుకుపోతున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దళారులు దర్జాగా లారీలు తీసుకువచ్చి ధాన్యాన్ని తూకం వేసి తీసుకెళ్తున్నారు. రోజులు గడుస్తున్నా కల్లాలవైపు నిర్వాహకులు ఎవరూ రాకపోవడంతో రైతులకు వేరే దారి లేక దళారి చెప్పిన ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు.
ఎవ్వరు వచ్చింది లేదు, పోయింది లేదు
మా ఊర్ల నేనే మొట్టమొదటి సారి పొలం కోసి ఆరబెట్టిన. కలెక్టర్ సార్ ఈ నెల 13న ఆరిన నా వడ్ల కాడనే కొబ్బరికాయ కొట్టిండ్రు. గప్పటి నుంచి గీ రోజుదాక ఎవ్వరూ వచ్చింది లేదు, పోయింది లేదు. రోజు కల్లంకు వచ్చుడు, పోవుడే నా వంతైంది. చూసీ చూసీ షావుకారుకు తుట్టికి పావు సేరు లాస్‌తో అమ్ముకుంటున్న. కొనేటోళ్లు లేక మంచిగ ఆరిన వడ్లను అమ్ముకునుడైంది. గిసొంటి ఆఫీసర్లు ఫొటోలకు ఫోజులిచ్చుడు తప్ప పనైతే సున్న. అన్ని బయటకు అమ్ముకున్నంక ఇంకెప్పుడు గౌర్నమెంటోల్లు కొంటరు?
దెబ్బటి నాగయ్య, రైతు, సీతారాంపల్లి, నస్పూర్