18-03-2025 12:45:18 AM
హైడ్రా ప్రజావాణికి 59 ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17(విజయక్రాంతి): ప్రభుత్వ భూమితో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, ఎక్క డా కబ్జా కాకుండా చూడాలని హైడ్రా కమిషనర్ అధికారులకు సూచించారు. సోమ వారం హైడ్రా ప్రధానకార్యాలయంలో జరిగిన ప్రజావాణికి 59 ఫిర్యాదులు వచ్చాయి.
ప్రభుత్వ స్థలాలే కాదు.. నాలా, రహదారి అనే తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నా యి. ఆ ప్రాంతాల్లో ఏమాత్రం అవకాశం ఉ న్న అడుగు జాగాను కూడా కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పిర్యాదులు అందజేశారు. ఆ ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అప్పగించారు.
హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులు ఇలా..
బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని శ్రీ వేంకటేశ్వర కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 600 గజాల స్థలంతో పాటు.. తన ఇంటి స్థలాన్ని కూడా కొంతమేర వెనుక వైపు ఉన్న ప్లాట్ యజమాని కబ్జా చేశారని అన్నపూర్ణ అనే మహిళ హైడ్రాకు ఫిర్యాదు అందజేశారు. నాగిరెడ్డి గొలుసు కట్టు చెరువు ఎఫ్టీఎల్ పరిధితోపాటు.. నాలాను, బఫర్ జోన్లో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయని యాప్రాల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫిర్యాదు చేసింది.
హయత్నగర్ మున్సిపాలిటీ సర్కిల్ 3 లోని వివేకానందనగర్ కాలనీలో 25 అడుగుల రహదారిని ఆక్రమించి ఏకంగా ఇల్లు నిర్మించేశారని.. గతంలో మున్సిపాలిటీ అధికారులు కూల్చేసినా.. మళ్లీ ఇంటిని నిర్మించేశారని ఫిర్యాదు చేశారు. కేపీహెచ్బీ లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు రోడ్డును మొత్తం ఆక్రమించి చిరు వ్యాపారాల పేరిట దందా లు చేస్తున్నారని..
అక్కడ తోపుడు బళ్లపై వ్యాపారాలే కాదు.. శాశ్వతంగా డబ్బాలు పెట్టి మొత్తం రోడ్డును ఆక్రమించేశారని కేపీహెచ్బీ ఫేస్ 1, 2 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నార్త్ లాలాగూడలోని బస్తీలో 940 గజాలు ప్రజావసరాలైన పాఠశాల, కమ్యూనిటీ హాల్‌కు కేటాయించగా.. అందులో 160 గజాల స్థలం తనదంటూ ఓ వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నారని ఫిర్యాదును స్థానికులు అందజేశారు.