30-04-2025 02:55:44 PM
మునుగోడు,(విజయక్రాంతి): పార్టీలకతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందించడానికి, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాల , పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు చర్చించడానికి ఇది ఒక నిలయం గా మారుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Munugodu MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో అదనపు గదుల నిర్మాణంతో పాటు అధికారిక క్యాంపు కార్యాలయం ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ శ్రీదేవి తో కలసి ప్రారంభించిమాట్లాడారు.
తెల్లవారుజామున అధికారిక క్యాంపు కార్యాలయంలో తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి తో కలిసి గృహప్రవేశం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు చర్చించడానికి, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి మీటింగ్ హాల్, వ్యక్తిగత సిబ్బంది కి అదనపు గదుల నిర్మాణం, క్యాంపు కార్యాలయ ఆవరణలో సిసి పనుల నిర్మాణం తో పాటు శాసనసభ్యులు నివసించడానికి వీలుగా భవనాలను ఆధునికరించారు.ఈ ఇల్లు మునుగోడు ప్రజల ఇల్లు అని, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మారుతుంటాయని అధికారం శాశ్వతం కాద ని మనం కూడా శాశ్వతం కాదని అన్నారు... కానీ ఆధునీకరించబడిన ఈ క్యాంపు కార్యాలయం శాశ్వతంగా ఉంటుందని . ఈ ప్రాంతం బాగుంటేనే మనందరం బాగుంటామని పేద ప్రజల కు కావలసిన కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుని పై ఉందన్నారు.
ఇందిరమ్మ గృహాల మంజూరు అంశంపై సమావేశం..
మొదటి నాడే నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల మంజూరు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితిపై నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నిజమైన లబ్ధిదారుల పేర్లు రావడం లేదని, ఆటో, ట్రాక్టర్, కారు నడుపుకుంటూ జీవనం కొనసాగించే పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కష్టమైందని మండలాల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.మొదటి విడతగా అత్యంత నిరుపేదలైన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, అనంతరం విడతల వారీగా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అనర్హుల పేర్లను ఇష్టానుసారంగా జాబితాలో చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు. క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి,చండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ,పున్న కైలాస్ నేత, నారబోయిన రవి ముదిరాజ్, జక్కలి ఐలయ్య,భీమనపల్లి సైదులు,వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ యాదవ్,జాల మణికంఠ,పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.