28-04-2025 01:26:24 AM
స్థానిక సంస్థల్లో గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలి
పార్టీని నమ్ముకున్న అందరికీ న్యాయం చేస్తాం
రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అహ్మద్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్27( విజయ క్రాంతి): పార్టీ కోసం కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అహ్మద్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన భారత్ సంవిధాన్ బచావో సభకు ఎమ్మెల్సీ దండే విఠల్, పెద్దపెళ్లి గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. రాజకీయ ఆర్థిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పార్టీ అభివృద్ధి కోసం గ్రామ కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తా మన్నారు స్థానిక సంస్థల్లో గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ పునర్నిర్మాణానికి నిరంతర ప్రయత్నం చేయాలని సూచించారు.
వ్యక్తి ముఖ్యం కాదని పార్టీ మాత్రమే ముఖ్యమన్నారు.పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని వివరించారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని పార్టీ అనేది ప్రవాహ లాంటిదని, దానిలో కొత్తనీరు పాతనీరు వస్తు ఉంటుందని అందరిని కలుపుకుని ముందుకు సాగాలన్నారు. పార్టీలో జరిగే ప్రతి విషయం కార్యకర్త తెలియజేయడం జరుగుతుందని, ఎటువంటి రహస్యాలు ఉండవని అన్నారు.
పార్టీని నమ్ముకుని అందరికీ న్యాయం చేస్తామని, జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. పార్టీలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయం చివరిదని ఎవరు వాటి గురించి మాట్లాడకూడదని చురకలు అంటించారు. పునాదులు బలంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందుతుందని ఈ బాధ్యత కార్యకర్తలపై ఉంటుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజ్యాంగ రచన కాంగ్రెస్‌తోనే సాధ్యమైందని తెలిపారు. 1932 లాహోర్లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజ్యాంగ రచన అంశం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అంబేద్కర్ వేరు కాదని అన్నారు.
59 వేల ఉద్యోగాలు ఇచ్చినం..
ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినప్పటికీ మొదటి 10 సంవత్సరాల టీఆర్‌ఎస్ పరిపాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. జిల్లా వాసులకు ప్రాణదారమైన గతంలో కాంగ్రెస్ ప్రారంభించిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పడంతో పాటు డీపీఆర్ సిద్ధం చేయడం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినట్టు అవుతుందన్నారు. సంవత్సర కాలంలో 59 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందన్నారు.
పెద్దపెల్లి గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ వివిధ రకాల కమిటీలలో అవకాశం ఇచ్చిన నాయకులు సమావేశలకు హాజరు కకుంటే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పిసిసి అధ్యక్షుడు వివరించినట్లు వెల్లడించారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ మాట్లాడు తూ నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో చేసే కార్యక్రమాల కోసం దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాలు నాయకులు పాల్గొన్నారు