calender_icon.png 16 November, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధితోపాటు సంక్షేమానికి ప్రాధాన్యం

16-11-2024 12:51:30 AM

  1. ప్రజాదరణను ఓర్వేలేక బీఆర్‌ఎస్ నేతల కుట్రలు
  2. తప్పు చేసిన వారెవరైనా జైలుకు వెళ్లక తప్పదు
  3. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భైంసా, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజాసంక్షేమానికీ ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాని వెళ్లి తిరిగి వస్తూ భైంసా చేరుకున్నారు.

అక్కడ మాజీ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ దశాబ్ద కాలం పాటు ప్రజలను మోసం చేస్తూ నిరంకుశ పాలన సాగించిందన్నారు. అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడుతూ రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని  దుర్వినియోగం చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దుబారాను అరికడుతున్నదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీ చేసిందన్నారు. సంక్షేమ పథక్షాలను అమలు చేస్తున్నదన్నారు. దశలవారీగా ఇంకా కొన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. తమ ప్రజాదరణ చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు.

వాస్తవాలు ప్రజలకు తెలుసన్నారు. తప్పులు చేసిన వారెవరైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు. రూ.2 లక్షలకు పైగా అప్పు ఉన్న రైతుల రుణమాఫీని త్వరలోనే చేస్తామని,  ధాన్యానికి మద్దతు ధరతోపాటు రైతు భరోసా సొమ్మును చెల్లిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డులు అందిస్తామన్నారు. సమ న్యాయం కోసమే సామాజిక కుల గణన చేపట్టామని స్పష్టం చేశారు.

ప్రజలు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ నివాసానికి వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు అందజేశారు. తదనంతం కలెక్టర్ అభిలాష అభినవ్‌తో జిల్లా పరిస్థితులపై చర్చించారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, నేతలు మురళీగౌడ్, నాయకులు ఓం ప్రకాష్ లడ్డా ఉన్నారు.