- బీబీపేటలో కస్తుర్భాగాంధీ విద్యార్థినుల ఆందోళన
- బదిలీ చేయాలని డిమాండ్
కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): ఇంటర్ కాలేజీ విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ, వేధిస్తున్నదంటూ ఆదివారం సాయంత్రం కళాశాల ఎదుట విద్యార్థినులు ఆందోళన చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేటలో జరిగింది. బీబీపేట్‌లో ఉన్న కస్తుర్భాగాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ మంగ అసభ్యకరంగా తిడుతున్నదని విద్యార్థినులు ఆరోపించారు.
ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలోని అటెండర్లు తమచేత బెంచీలు మొయిస్తున్నారని, తమను కొడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపాల్ వేధింపులను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రిన్సిపాల్ హాస్టల్ వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడకు వెళ్లి విద్యార్థునులకు నచ్చజెప్పారు. ప్రిన్సిపాల్ మంగ మాట్లాడుతూ.. తాను దుర్భాషలాడలేదని తెలిపారు. విద్యార్థినులను క్రమ శిక్షణలో పెట్టేందుకే మాట్లాడానే తప్ప వేరే ఉద్దేశం తనకు లేదన్నారు.