calender_icon.png 23 October, 2024 | 3:05 AM

కార్యసిద్ధి సూత్రాలు

23-10-2024 12:00:00 AM

పాలకుర్తి రామమూర్తి :

కర్మణామ్.. ఆరంభోపాయః 

పురుషద్రవ్య సంపత్

దేశకాల విభాగః  వినిపాత ప్రతీకారః 

కార్య సిద్ధి ఇతి  పంచాంగో మంత్రః 

 కౌటిలీయం (చాణక్య-1-15)

ఒక పనిని ఆరంభించి పూర్తి చేయడానికి అయిదు అంగాలు కలిగిన మంత్రం ఉపదేశిస్తున్నారు చాణక్య. ఆరంభించడానికి ఉపాయం, పురుష సంపద, ద్రవ్య సం పద, దేశకాల పరిస్థితుల పరిశీలన, ముం దుకు సాగడంలో అవరోధాలు వాటిని అధిగమించడం, చివరగా కార్యసిద్ధి. ఒక సంస్థను ఆరంభించడానికి సన్నద్ధమవడం అంటే అప్పటికే ఆ రంగంలో పాతుకుపోయిన వారిపై యుద్ధాన్ని ప్రకటించినట్లే.

వారు ఎన్నయినా అవరోధాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి, కార్యాన్ని త్వరగా, జాగ్రత్తగా ఆరంభించి పరిసమాప్తి చేయాలి. నమ్మకస్థులైన వారితో బృందా న్ని ఏర్పాటు చేసుకోవాలి. వారిలో ఒక్కొక్కరితో విడిగానూ, ఉమ్మడిగానూ సాధ్యా సాధ్యాలను చర్చించాలి. వారిలో ఒకరి అభిప్రాయాలను మరొకరు వ్యతిరేకిస్తున్నారంటే కారణాలను తెలుసుకోవాలి. 

ఆరంభించడానికి ముందుగానే, సం బంధించిన పూర్తి సమాచారం సేకరించుకొని విశ్లేషణ చేసుకోవాలి. సాధించే మార్గంపై స్పష్టమైన అంచనాలు ఉండాలి. తదుపరి మానవ వనరులు, ముడి సరకులు, యంత్ర సామాగ్రిని, ఆర్థిక వనరు లను సమీకరించుకోవాలి. సంస్థ నిర్మాణానికి ఏ ప్రదేశం అనుకూలమో, ఏ కాలం లో ఏ పనులు సానుకూలమవుతాయో చూడాలి.

ఉత్పత్తులను వినియోగదారునికి సకాలంలో చేర్చడానికి అనువైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. అలాగే, ఎవరిద్వారా ఆరంభించిన పనులకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నదో.. వాటిని ఎలా నిర్వహించుకోగలమో సమగ్రంగా ఆలోచించాలి. దానిని అధిగమించేందుకు పటిష్టమైన వ్యూహాన్ని తయారు చేసుకోవాలి. కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాక కార్యాన్ని ఆరంభించి దక్షతతో అమలుచేయాలి.

సరైన సంస్థలో సరైన ఉద్యోగులు

కార్యస్వరూపం నిశ్చితమయ్యాక అమ లు చేయడంలో జాప్యం జరిగితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సంస్థ రహస్యాలు పోటీదారులకు చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వెంటనే దానిని అమలు చేయడం ఎంత అవసరమో ఎప్పటికప్పుడు పోటీదారుల రహస్యాలను తెలుసుకోవడమూ అంతే అవసరం. మానవ వనరులు సంస్థ పురోగతిలో ప్రధాన భూమికను పోషిస్తా యి.

సరైన వ్యక్తులు సరైన స్థానంలో నియమితులైతేనే అనుకున్న ఫలితాలు సాధించ గలం.  అర్హతా పరీక్షలు నిర్వహించి సమర్థులైన ఉద్యోగులను నియమించుకో వడం, వారు సంస్థను విడిచి పోకుండా అవసరమైన వాతావరణాన్ని కల్పించడం నాయకుని బాధ్యత. వృత్తి నైపుణ్యాలు, సంబంధిత రంగంలో లోతైన విజ్ఞానం, పరిధులను దాటి ఆలోచించగల ధీపటిమ గలిగిన ఉద్యోగులు సంస్థను ప్రగతి పథంలో నడిపించ గలుగుతారు. 

అలాంటి వారికి సంబంధిత రంగంలో వస్తున్న అధునాతన సాంకేతికతలపైన నియమిత అంతరాలలో శిక్షణను అందించాలి. అప్పుడు వారి పని తీరు అత్యుత్త మంగా ఉంటుంది. ప్రతిభ ఆధారంగా జీతభత్యాలు అందించే సంస్థపట్ల నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులూ సంతృప్తితో ఉంటా రు.

నిబద్ధతతో శక్తికి మించిన సేవలు అందిస్తారు. ఆర్హిక వనరులు సంస్థ నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ అత్యంత ప్రధానమైనవి. బలీయమైన ఆర్థిక మూలాలు ఉన్న సంస్థ.. నైపుణ్యం, నాణ్య త కలిగిన అభ్యర్థులను ఆకట్టుకుంటుంది. అలాగే నైపుణ్యాలు, దార్శనికత కలిగి, నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు పని చేసే సంస్థ అమ్మకాలు కూడా వృద్ధి చెందుతూ లాభాలను ఆర్జిస్తాయి. 

నాణ్యతా ప్రమాణాలు, ఆధునిక అవసరాలకు అవసరమైన పరిశోధనలు జరుగు తున్న సంస్థ అధునాతన వస్తువులను నాణ్యతతో అందివ్వ గలుగుతుంది. అందువల్ల వినియోగదారుని మన్ననలను పొందగలుగుతుంది. విక్రయానంతర సేవలు అందించడం, వినియోగదారులతో నిరంతరం మమేకం అవడం వల్ల సంస్థ అమ్మకాలు ఆకాశాన్ని అంటుతాయి.

అన్నీ బాగున్నా అంచనాలకు తగిన లాభాలు ఆర్జించలేని సంస్థవల్ల ప్రయోజనం ఏమిటి? అందుకనే ఉత్పత్తి వ్యయా న్ని తగ్గించుకుంటూ, పోటీదారుని అమ్మ కం ధరకు దగ్గరలో అంతకు మించిన నాణ్యతను అందివ్వాలి. సేవల పరిమితిని పెంచుకోవడం వల్ల అమ్మకాలు పెరగడమే కాదు, లాభాల శాతమూ అధికమవుతుంది.

ఈ ప్రయత్నంలో రెండు అవకా శాలు ఉంటాయి. మొదటిది: సంస్థ అన్ని సంస్థల వలెనే సాధారణ ఫలితాలను అందిస్తూ అనామకంగా మిగిలిపోవడం. రెండవది: నాయకుడు కూడా ఊహించని ఎత్తుకు ఎదగడం. ఈ రెండూ నాయకుని నాయకత్వ పటిమపై ఆధారపడి ఉండేవే.