calender_icon.png 5 February, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానమంత్రి శ్రీ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

05-02-2025 06:03:47 PM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి... 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన ఆదర్శ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి ఈ. గమ్మనియల్ తో కలిసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఎంపికైన పాఠశాలలలో శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన మౌలిక వసతులు, త్రాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, బాలికల మూత్రశాలల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా సిద్ధం చేసి వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు పూర్తిస్థాయి సౌకర్యాల నడుమ నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో జిల్లాలో మంజూరైన పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త ఆబిద్ అలీ, ఇంజనీరింగ్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.