పాల్గొన్న హోం, రక్షణ మంత్రులు
న్యూఢిల్లీ, జూలై 18: కొద్ది రోజులుగా జమ్మూలో భద్రతా బలగాల మీద జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌కు కొద్దిగంటల ముందే దోడా జిల్లా లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మొన్నటి దాడి తర్వాత ఉగ్రవాదుల కోసం బలగాలు జల్లెడ పడుతున్న క్రమంలో ఈ దాడి జరిగింది. పోయిన నెలలోనూ మోదీ జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్మూ రీజియన్‌లో గడిచిన 32 నెలల్లో 48 మంది సిబ్బంది కన్నుమూశారు.
ఆరు నెలల ముందే దేశంలోకి వచ్చిన ఉగ్రవాదులు..
జైషే సంస్థకు చెందిన పలువురు ఉగ్రవాదులు ఆరునెలల ముందే దేశంలోకి వచ్చినట్లు సమాచారం. ఫ్రెష్ బ్యాచ్ టెర్రరిస్టులు వచ్చారని, వారే ఇంత ఘోరానికి పాల్పడ్డారని అంతా అనుమానిస్తున్నారు. పాక్‌లోని ఖైబర్ పంక్తుక్వా, పంజాబ్ ప్రాంతాల వారే ఈ దాడుల్లో పాల్గొన్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్ మాజీ సైనికులు కూడా దాడుల్లో పాలు పంచుకున్నారని సమాచారం. పూంచ్ ఘటనలకు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్, కథువా, దోడా ఉగ్రదాడులకు కశ్మీర్ టైగర్స్ సంస్థలు బాధ్యత వహిస్తూ ప్రకటనలు చేశాయి. ఈ రెండు కూడా జైషే మహమ్మద్ తోక సంస్థలే కావడం గమనార్హం.