19-04-2025 05:57:21 PM
సూర్యాపేట: భారతదేశం భిన్న సంస్కృతులు సాంప్రదాయాలకు ఆలవాలం అలాంటి దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ కొన్ని సామాజిక వర్గాలపై కక్ష్య పూరితంగా, వారి మృతి స్వేచ్ఛను హరించేలా పాలన సాగిస్తున్నారని విశ్రాంత ఎస్సై షేక్ అబ్దుల్లా, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, ముస్లిం మైనారిటీ జిల్లా నాయకులు ముఫ్తీ అస్రార్ సాహెబ్ లు విమర్శించారు. ఈనెల 22 న సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ఎంజీ రోడ్డు మమతా బాంకెట్ హాల్లో నిర్వహించబోయే వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అను సెమినార్ కు సంబంధించిన కరపత్రాన్ని పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో ఆవిష్కరించి, పంపిణీ చేసి ప్రచారం చేపట్టారు.
అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించే రాజ్యాంగాన్ని మార్చాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం మత స్వేచ్ఛ, సమానత్వ హక్కు, ఆస్తి హక్కు వంటి వాటిని విస్మరించి నియంతృత్వాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. రాజ్యాంగ పీఠికలోని లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద అంశాలను తుంగలో తొక్కుతూ మతం, కులం పేరుతో దేశంలో కల్లోలను సృష్టిస్తూ మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. సెమినార్ కు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.