calender_icon.png 23 September, 2024 | 3:48 PM

నాపై ప్రధాని మోదీ కుట్ర

23-09-2024 02:20:23 AM

ప్రాంతీయపార్టీ నేతలపై సీబీఐ, ఈడీల ప్రయోగం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ‘నన్ను అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధానమంత్రి మోదీ నాపై కుట్రపన్నారు. ఈ కుట్రలో మనీశ్ సిసోడియా సైతం బలయ్యారు. ఆప్‌ను అప్రతిష్ఠ పాలు చేసేందుకే ప్రధాని మాపై నేరారోపణలు మోపారు. నేను డబ్బు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాలు మార్చేందుకే వచ్చాను’ అని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము జాతీయవాదులమని, దేశభక్తులమని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు అనుకుంటున్నారని, నిజానికి వారు దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు.

ప్రధాని మోదీ ప్రాంతీయపార్టీ నేతలపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతుంటే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలను పడగొట్డడంపై మోహన్ భగవత్ ఎలా స్పందిస్తారో చూడాలని ప్రజలు కోరుతున్నారన్నారు. మోదీ అత్యంత అవినీతి పరులను బీజేపీలో చేర్చుకుంటుంటే ఆర్‌ఎస్‌ఎస్ ఏం చేస్తోందని నిలదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఆర్‌ఎస్‌ఎస్ అవసరమే లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారని గుర్తుచేశారు. ఆయన వ్యాఖ్యలను ఆర్‌ఎస్‌ఎస్ ఎలా తీసుకుందో స్పష్టం చేయాలని కోరారు.