గత వారం రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో వాడి వేసవివేడితో పాటుగా పెరుగుతూ వస్తోంది. రాజస్థాన్‌లో ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన మోడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల సంపదను లాగేసుకుని వలసవచ్చిన వాళ్లకు, ఎక్కువమంది సంతానం ఉన్నవాళ్లకు పంచి పెడుతుందంటూ చేసిన తీవ్రవ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పటికీ చల్లారలేదు. ప్రధాని ఇవే ఆరోపణలను చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలోనూ మరోసారి ప్రస్తావించడంతో అది మరింత రాజుకుంది. కొద్ది రోజుల క్రితం కేరళలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణను జరిపి తీరుతామని చెప్పారు. ‘కులగణన అంటే ఏదో నామ్‌కే వాస్తే కులాలపై సర్వే కాదు. ఈ సర్వేకు తోడు ఆర్థిక పరమైన, వ్యవస్థాగతమైన సర్వేకూడా చేపడతా’మని రాహుల్ అన్న వ్యాఖ్యలే ప్రధాని మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోపై దాడి చేయడానికి బీజం వేసింది.
దీన్ని సాకుగా తీసుకున్న ప్రధాని హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డల మెడలోని పుస్తెలను కూడా లాక్కుంటారని రాజస్థాన్ సభలో అన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగానే స్పందించింది. తమ మేనిఫెస్టోలో లేని అంశాన్ని లేవనెత్తి, దాన్ని వక్రీకరించి సమాజంలో చీలికలను, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఆ పార్టీ. ప్రధాని మాత్రం తన ఆరోపణపై ఏ మాత్రం తగ్గలేదు సరికదా, మరింత దూకుడు పెంచారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను, అలాగే భారత్‌లోనూ అమెరికా తరహాలో వారసత్వ పన్ను ఉండాలంటూ కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై దాడిని మరింతగా పెంచారు. చనిపోయిన వారి ఆస్తులనూ ఆ పార్టీ వదలబోదంటూ మరో బాంబు పేల్చారు. బీసీల కోటాను తగ్గించి కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ గతంలో ప్రయత్నించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వగా, ప్రధానిపై కాంగ్రెస్ నేతలంతా ముప్పేట దాడికి దిగారు. గతంలో ఎన్నడూ ముస్లింలపై నేరుగా విమర్శలు చేయని ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే దానిపై రాజకీయ పండితులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడం, పోలింగ్ సరళి బీజేపీకి అనుకూలంగా కనిపించడం లేదంటూ వచ్చిన వార్తలే ప్రధాని తన ప్రచార దూకుడును పెంచడానికి కారణమని కొందరు పరిశీలకులు అంటున్నారు. హిందూ ఓటు బ్యాంకును పటిష్టం చేయడానికి ఇదే సరైన మార్గమని కమలం పార్టీకి అన్నీ తానే అయి ప్రచారం చేస్తున్న మోడీ భావించి ఉంటారని వారంటున్నారు.
ముస్లింలను, కాంగ్రెస్‌ను కలిపి ఏకకాలంలో దాడి చేయడం ద్వారా బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకు అయిన హిందుత్వ వర్గాలను ఏకం చేసుకోవచ్చన్నది ఆయన వ్యూహం కావచ్చని వారంటున్నారు. అయితే, ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కాదని, కాంగ్రెస్ పార్టీ ముస్లింల బుజ్జగింపు వైఖరిని ఎండగట్టే ప్రయత్నంలో ఆ మాటలు అని ఉంటారని మరోవర్గం వాదిస్తోంది. ఏది ఏమైనా, ప్రధాని చేసిన వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మరో దిక్కుకు మళ్లించదనేది వాస్తవం. మోడీ వ్యాఖ్యలతో అంతవరకు ప్రధాని పాలనా వైఫల్యాల ను ఎండగడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై వివరణ ఇచ్చేందుకు మోడీ అపాయింట్‌మెంట్ కోరిందంటేనే ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. మరోవైపు ప్రధాని రాజస్థాన్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చింది.