16-03-2025 10:20:26 PM
భద్రాచలం (విజయక్రాంతి): పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవాలయంలో జరిగే అతి ముఖ్యమైన ఉత్సవం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముందు పాల్గుణ పౌర్ణమి నాడు నిర్వహించే అంకురార్పణ, వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు ఆలస్యం ప్రారంభం కావడానికి రామాలయం అర్చకులు కాదని, ఆలయ ఈఓ ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమే కారణం అని ఆలయ స్థానాచార్యులు స్థల సాయి, ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, అర్చకులు రామ స్వరూప్, మురళీ లు తెలియజేశారు. అర్చకుల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వీడియో విడుదల చేశారు. ఆలయంలో జరిగే ఉత్సవాలు నిర్వహించడానికి ముందుగానే ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్ లను నిర్ణయుస్తామని, వీరు లక్ష్మి నరసింహాస్వామి బ్రహ్మోత్సవాల నుండి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల వరకూ వారే ముందుండి ప్రతి ఉత్సవం జరిపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆచార్యగా ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, బ్రహ్మగా ఉపప్రధాన అర్చకులు అమరవాది వెంకట శ్రీనివాస రామానుజం వ్యవహారిస్తున్నారని తెలిపారు. కాగా కొన్ని పరిపాలన పరమైన కారణాలు, ఆరోపణలతో బ్రహ్మగా ఉన్న శ్రీనివాస రామానుజంను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్ణశాల ఆలయానికి మార్చి 9న బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, దానికి శ్రీనివాస రామానుజం 10వ తేదీన జాయినింగ్ లేఖతో పాటు తాను భద్రాద్రి రామాలయంలో జరిగే ఉత్సవాలకు బ్రహ్మగా ఉన్నందున తనకు అంకురార్పణ, వసంతోత్సవం, డోలోత్సవం, శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో పాల్గొనే అనుమతి ఇవ్వాలని కోరారని, ఆయనతో పాటు ఆ వినతిపత్రంపై ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు తమ అభిప్రాయం కూడా క్రోడీకరిస్తూ సంతకం చేసి ఈవోకు అందజేసినట్టు తెలిపారు.
అయినా ఈఓ వద్ద నుంచి ఎటువంటి అనుమతులు రాకపోవడంతో ఇద్దరు ప్రధాన అర్చకులు ఈఓ ని పలుసార్లు స్వయంగా కలిసి ఆలయంలో మతపరమైన సంప్రదాయాలు గురించి వివరిస్తూ... బ్రహ్మ లేకుండా ఉత్సవాలు నిర్వహించడం వీలుకాదని తెలిపినా ఈఓ స్పదించలేదని తెలిపారు. ఆఖరకు 13వ తేదీ అంకురార్పణ రోజు సాయంత్రం అర్చకులు అందరు ఒక లేఖను ఈఓ కి అందజేసినా, ఈవో బ్రహ్మ పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేదని, బ్రహ్మ లేనిదే ఉత్సవం నిర్వహించలేమని, మతపరమైన సంప్రదాయానికి విరుద్ధం అని తెలపడంతో, చివరకు ఈఓ స్పందించి అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈఓ సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన అంకురార్పణ రాత్రి 9 గంటలకు ప్రారంభం అయిందని పేర్కొన్నారు. దీంట్లో అర్చకులు ఏ మాత్రం తప్పిదం లేదని తెలిపారు.
అలాగే ఆలయంలో జరిగే మతపరమైన, వైదికమైన వివిధ అంశాలు నిర్ణయించే అధికారం ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులకు ఉంటుందని తెలిపారు. పాలనా పరమైన అంశాలలో ఈఓ ని తప్పనిసరిగా గౌరవిస్తామని, అలాగే మత పరమైన, వైదికమైన విషయాలలో అర్చకులను ఈఓ గౌరవించాలని అన్నారు. ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస రామానుజం విషయంలో కూడా ఈఓ నిర్ణయానికి అడ్డు చెప్పలేదని, కానీ బ్రహ్మ లేకుండా ఉత్సవాలు నిర్వహించడం కుదరదు కనుక శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల వరకూ పాల్గొనే అనుమతి ఇవ్వాలని అడిగామని, బ్రహ్మోత్సవాలు అనంతరం పాలనా పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దేవాలయం వైదిక కమిటీకి అభ్యంతరం లేదని వారి సందర్భంగా తెలిపారు.