calender_icon.png 30 March, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్సర హత్య కేసులో పూజారికి జీవితఖైదు

27-03-2025 01:27:03 AM

  1. ఆలయానికి వచ్చిన యువతితో ప్రేమాయణం
  2. భార్యాపిల్లలు ఉన్నా యువతితో సంబంధం 
  3. పెండ్లి చేసుకోమని కోరితే కాటికి పంపిన పూజారి 
  4. 2023లో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ హత్య కేసు

ఎల్బీనగర్/రాజేంద్రనగర్, మార్చి 26: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 2023లో జరిగిన అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు బుధవారం నిందితుడైన పూజారి వెంకటసూర్యసాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ తన భార్య, కూతురితో కలిసి సరూర్‌నగర్ లోని శ్రీ వేంకటేశ్వర కాలనీలో నివాసం ఉండేవాడు.

స్థానికంగా మైసమ్మ దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు. పూజారి పనులతో పాటు కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన కురుగంటి అప్సర (30) తన తల్లితో కలిసి ఇదే కాలనీలో నివా సం ఉండేది. అప్సర పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో  చిన్న పాత్రల్లో నటిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేసేది. ఈ క్రమంలో సాయికృష్ణ పూజారిగా పనిచేసే మైసమ్మ ఆలయానికి అప్సర వెళ్తుండేది.

ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా నాలు గేండ్ల పాటు సంబంధం కొనసాగించింది. తనను పెళ్లిచేసుకోవాలని సాయికృ ష్ణను పలుమార్లు అప్సర ఒత్తిడి చేసింది. ఒత్తిడి తట్టుకోలేక ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని సాయికృష్ణ పథకం రచించాడు. 2023 జూన్ 3న కోయంబత్తూరుకు వెళ్దామని అప్సరను కారు లో తీసుకుని వెళ్లాడు.

అదేరోజు రాత్రి 11 గంటల సమయం లో శంషాబాద్ మం డలం నర్కుడ గ్రామంలోని నవరంగ్ వెంచర్‌లోకి తీసుకెళ్లాడు. అప్ప టికే నిద్రలో ఉన్న అప్సర ముఖంపై కారుపై కప్పే కవర్‌తో ఊపిరి ఆడకుండా చేసి, రాయితో తలపై కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని కవర్‌లో చుట్టి కారు డిక్కీలో వేసుకొని తన ఇంటికి వెళ్లాడు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో మా యం చేయాలని అనుకున్నాడు.

సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రా ర్ కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్‌లో మృతదేహాన్ని వేసి, మట్టితో పూడ్చిపెట్టాడు. అప్సర తల్లి తన కూతురు గురించి సాయికృష్ణను ప్రశ్నించగా.. స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని, తానే శంషాబాద్‌లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్లు సాయికృష్ణ నమ్మబలికాడు. తర్వాత పలుమార్లు అప్సరకు ఫోన్ చేసినా స్పందించలేదని చెప్పా డు.

ఆ తరావ్త ఏమీ తెలియనట్టు తల్లితో కలిసి శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ శ్రీధర్, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయికృష్ణ కదలికలు, మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆయ నను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసును ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది.

రంగారెడ్డి జిల్లా 11వ అడిషనల్ సెషన్స్ జడ్జి వై.జయప్రసాద్ బుధవారం నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించారు. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో ఏడేండ్ల శిక్ష విధించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం అందిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్ రవికుమార్ తమ వాదనలు వినిపించారు. నిందితు డికి శిక్ష పడేలా పని చేసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్లు ఏఎస్‌ఐ రామిరెడ్డి, కానిస్టేబుళ్లు ఖాజా పాషా, నరేంద్ర రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.