హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు లిఫ్ట్ మీద పడడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ప్రాంతానికి చెందిన నర్సింహ మూర్తి(55) అనే పూజారి ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రీతం అనే వ్యక్తి ఇంట్లో పౌరహిత్యం చేసేందుకు మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో వెళ్లాడు. ఈ క్రమంలో పై అంతస్తుకు వెళ్లేందుకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో లిఫ్ట్ కోసం వేచి చూస్తున్నాడు. లిఫ్ట్ రాకముందే గేట్ తెరిచిన నర్సింహమూర్తి ప్రమాదవశాత్తు లిఫ్ట్ కేస్‌లో పడిపోయాడు. ఆపై లిఫ్ట్ అతనిపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.