calender_icon.png 31 October, 2024 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాన్యులకు ధరల షాక్!

18-07-2024 02:49:42 AM

  • మండిపోతున్న సరుకుల రేట్లు
  • వారం వారం పెరుగుదల
  • పేద, మధ్య తరగతిపై పెనుభారం

మెదక్, జూలై 17(విజయక్రాంతి): సామాన్యులకు నిత్యావసర సరుకుల ధరలు షాకిస్తున్నాయి. వారంవారం పెరుగుతున్న రేట్లతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. కిలోల చొప్పున పప్పు దినుసులు, కూరగాయలను కొనుగోలు చేసిన కుటుంబాలు నేడు పావుకిలో చొప్పున తెచ్చుకుంటున్నా రు. కూలీ రేట్లు, ప్రైవేట్ ఉద్యోగుల వేతనాలు పెరగకుండా దైనందిన జీవితంలో రోజువారీగా అవసరమయ్యే సరుకుల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వాలు ధరల నియంత్రణపై చర్యలు తీసుకోక పోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడుతుందని పలువురు వాపోతున్నారు. 

పోటీపడి పెరుగుతున్న ధరలు..

బియ్యం, కూరగాయలతోపాటు నిత్యావసర సరుకుల ధరలు పోటీపడి పెరిగిపోతున్నాయి. భగ్గుమంటున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ తలకిందులుగా మారిపోతుంది. క్వింటాల్‌కు పాత సన్నబియ్యం రూ.6వేలకు పైగానే ఉన్నది. ఏదేని కూరగాయలు కిలో రూ.వంద వరకు పలుకుతున్నాయి. ఇక నిత్యావసర సరుకులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. 

నగలు తాకట్టు పెడుతున్న యజమానులు

నెలవారీ బడ్జెట్‌ను లెక్క వేసుకుని కుటుంబాలను పోషిస్తున్న ఇంటి పెద్దలు చుక్కలను తాకుతున్న ధరలు ఓ వైపు ఉంటే.. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇతర ఖర్చులను వెళ్లదీసేందుకు బంగారు నగలను తాకట్టు పెడు తున్నారు. నెలవారీ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడ్డాయని లెక్కలు చూపే మేధావులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అసలు సంగతి తెలుస్తుం దని పలువురు వాపోతున్నారు. నెల మారే వరకు ధరలు పోల్చుకోలేనంత పెరిగి పోతుండడంతో వ్యాపారాలు సైతం అంతం త మాత్రంగానే సాగుతున్నాయని వ్యాపారులు  చెబుతున్నారు.