calender_icon.png 6 October, 2024 | 6:51 AM

ధరల మోత

05-10-2024 12:11:43 AM

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు 

పేద, మధ్య తరగతి కుటుంబాలపై ప్రభావం 

పండుగల పూట ఆందోళన కలిగిస్తున్న పెరుగుదల

వికారాబాద్/మెదక్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మార్కెట్‌లో ధరల మోత మోగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం పడుతోంది. గత కొన్ని రోజులుగా బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పోటీపడి మరీ పెరుగుతున్నాయి.

పప్పుల ధరలను చూసి తినడం కాస్త తగ్గించినా, ప్రతి పూట అవసరమయ్యే బియ్యం ధర మిగతా వాటితో పోటీ పడి పెరుగుతుంది. మార్కెట్‌లో క్వింటా ల్ పాత సన్నబియ్యం ఆగస్ట్‌లో రూ.6 వేలు ఉండగా ఇప్పుడు రూ.7 వేలకు పెరిగిపోయింది. కూరగాయలు కిలో రూ.80 పైనే ఉన్నాయి.

దసరా, దీపావళి రాబోతున్న తరుణంలో ధరలు ఆకాశాన్నం టుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణాల్లో ఉండే వారు కూడా సెలవుల్లో పల్లెలకు చేరుకుంటారు. అందరు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాల్సిన పండుగల సమయంలో ధరల పెరుగుదలతో కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.  కాగా, ధరల నియంత్రణపై పాలకులు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పప్పులు పిరం

ఓ వైపు బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. చాలా కుటుంబాల్లో ఈ ౯ రోజులు పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంటారు. మరోవైపు దసరా పండుగ వస్తోంది. ఈ సమయంలో పప్పుల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శనగ, కంది పప్పులు ఒక్క నెలలోనే కిలో రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగాయి.

కంది, శనగ, పెసర, మినుప రకాలకు చెందిన రెండో రకం కొనాలన్నా కిలో రూ. 120కి పైగానే పలుకు తోంది. నెలవారి బడ్జెట్‌ను అంచనా వేసుకొని కుటుంబాన్ని నడిపించేవారి లెక్కలు తారుమారవుతున్నాయి. పెరిగిన ధరలతో సరుకుల్లో కోత పెట్టాల్సి వస్తోంది. కూలీ రే ట్లు, ప్రైవేట్ ఉద్యోగుల వేతనాలు పెరగకుండా రోజువారీగా అవసరమయ్యే సరుకుల ధరలు ఇలా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

నూనెలు సలసల 

నూనెల ధరలు లీటరుకు సగటున రూ.20 వరకు పెరిగాయి. దిగుమతి సుంకం పెరగడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ముడి సరుకుగా దిగుమతి చేసుకునే వంట నూనెలకు (క్రూడ్ ఆయిల్) గతంలో 12.5 శాతం సుంకం ఉండేది. తాజాగా కేంద్ర ప్రభుత్వం దీన్ని 32.5 శాతానికి పెంచడంతో భారం పెరిగిపోయింది. ఒక్కో కుటుంబం సగటున ఐదు లీటర్ల నూనెను వినియోగిస్తారు. ఈ లెక్కన నెలకు కుటుంబంపై రూ.100 అదనంగా భారం పడుతున్నట్లే.

మండిపోతున్న కూరగాయల ధరలు

కూరగాయల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతుండటం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ ఏడాది అకాల వర్షాలు అధికంగా ఉండటంతో కూరగాయల సాగు బాగా దెబ్బతింది. ఈ కారణంగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో వంకాయ, టమాట వంటి వాటికి మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం వికారాబాద్ మార్కెట్‌లో కిలో టమాట రూ.60 ఉండగా,  వంకాయ రూ. 60, క్యాప్సికమ్ రూ.80, బెండ రూ.60, బీరకాయ రూ.80, కాకరకాయ రూ.60, క్యారెట్ రూ.80గా ధర పలుకుతోంది. 

భారంగా మారుతోంది

గత నెల కంటే లీటరు నూనె ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారుతోంది. నూనెలు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉంచి రాయితీపై విక్రయిస్తే కొంత మేలు జరుగుతుంది. పెరుగుతున్న ధరలను ప్రభుత్వం నియంత్రించాలి.

 సునీత, గృహిణి, వెల్దుర్తి

పండుగ పూట ఇబ్బందులు

పప్పుల ధరలు బాగా పెరగడంతో కొనాలంటే లెక్కలు వేసుకోవాల్సి వస్తోం ది. సన్న బియ్యం ధరల పెరుగుదల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకసారి కొన్నాక నెల రోజుల నాటికి అవే బియ్యం అడిగితే ఆ రేటు ఉండడం లేదు. కూరగా యల ధరలు కూడా బాగా పెరిగాయి. పండుగ పూట ఇబ్బందులు తప్పవు.

 మల్లేశం, సెంట్రింగ్ మేస్త్రీ, వికారాబాద్