01-04-2025 04:31:16 PM
రహదారిపై గుంత పూడ్చిన ట్రాఫిక్ హోమ్ గార్డ్...
మంచిర్యాల (విజయక్రాంతి): ట్రాఫిక్ పోలీస్ విధులంటే కేవలం ట్రాఫిక్ ను నియంత్రించడమే కాదు.. ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతను పూడ్చి వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా చూడటం కూడా తన భాధ్యతగా భావించాడు మంచిర్యాల ట్రాఫిక్ హోమ్ గార్డ్. వివరాలలోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర చౌరస్తా దగ్గర మెయిన్ రోడ్డుపై ఇటీవల ప్రమాదకరంగా పెద్ద గుంత ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది.
ఈ రోడ్డు గుండా అధికారులు, నాయకులు రోజు ప్రయాణాలు చేస్తుంటారు కానీ ప్రమాదకరంగా మారిన ఈ గుంతను పట్టించుకున్న వారే లేరు. ఇది గమనించిన మంచిర్యాల ట్రాఫిక్ హోమ్ గార్డ్ వెంకటేష్ ఈ గుంతతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నందున ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా మంగళవారం గుంతలో ఇటుకలను నింపి, సిమెంట్, కంకరతో మూసి వేశాడు. దీనితో వాహనదారులకు ఇబ్బంది లేకుండా అయ్యింది. ట్రాఫిక్ హోంగార్డ్ వెంకటేష్ చేసిన పనికి స్థానికులు, వాహనదారులు మెచ్చుకుంటున్నారు. గుంతను పూడ్చే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హోంగార్డ్ వెంకటేష్ చేసిన పనిని అందరూ మెచ్చుకోవాల్సిందే మరి...