- పోలీసులకు ఆ అధికారాలు ఉన్నాయి
- ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేయాలి
- హైకోర్టు కీలక ఉత్తర్వులు
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): అనేక సౌకర్యాలు ఉన్నందున గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.. అక్కడ చట్టపరంగానే కార్యకలాపాలు జరగాల్సి ఉంది. అందుకు చర్యలు తీసుకో వాల్సిన సమయం వచ్చిందని హైకో ర్టు అభిప్రాయపడింది.
గేటెడ్ కమ్యూనిటీ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చట్టం లేనందున అవి తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం కింద నడుస్తున్నాయని, ఈ నేపథ్యం లో గేటెడ్ కమ్యూనిటీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మార్గదర్శకాలను నిర్దేశించాలని ఆదేశించింది.
అదే విధంగా హైద రాబాద్ పోలీస్ యాక్ట్ కింద చర్యలు తీసుకునేందుకు పోలీసులకు అధికారం ఉందని, కాబట్టి ఆ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకునేదీ ఆయా అసోసియేషన్లకు పోలీసులు తెలియజేయాలని ఆదేశించింది.
యాప్ ద్వారా ఫిర్యాదులు..
గేటెడ్ కమ్యూనిటీ జీవన శైలి మారుతున్న అక్కడ జరిగే అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం సిటీ పోలీసు చట్టం కింద పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. ఇందుకోసం మార్గదర్శకాల ను రూపొందించి గేటెడ్ కమ్యూనిటీ, ఫ్లాట్ ఓనర్ల అసోసియేషన్లకు జారీచేయాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.
వీటితోపాటు అనుసరించాల్సిన చట్ట నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను కూడా అందజేయాలని పేర్కొంది. కమ్యూనిటీలకు న్యూసెన్స్, నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు అందితే తక్షణం చర్యలు తీసుకునేలా పోలీస్‌స్టేషన్లు, టాస్క్ ఫోర్సు, టీఎన్సీబీకి కూడా పోలీసు కమిషనర్ ఆదేశాలివ్వాలని సూచించింది.
కమ్యూనిటీల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో సాధ్యమైతే ’యాప్’ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది. యాప్ ద్వారా ఫిర్యాదు చేసేవారి వివరాలను గోప్యంగా ఉంచాలంది.
హైదరాబాద్ కేపీహెచ్బీ ఇందూ ఫార్చ్యూన్ ఫీల్ విల్లాల కమ్యూనిటీలో అక్రమంగా పేకాట, మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం, లైంగిక చర్యలపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ అక్కడ నివాసం ఉంటున్న సీహెచ్ హరి గోవింద ఖొరానారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు వెళ్లి ఏం జరగలేదని తేల్చారు. కమ్యూనిటీలో సెక్యూరిటీ సిబ్బంది పోలీసుల రాకపై ముందస్తు సమాచారం ఇస్తుండటంతో ఆధారాలు మాయం చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. మరోసారి ఇందూలోని క్లబ్‌లో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో కమ్యూనిటీలో ఏమీ జరగలేదనడానికి వీల్లేదంటూ దీనిపై విచారించిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు.
క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించాలి
‘ఇందూ ఫార్చూన్ విల్లా కమ్యూనిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో లేనివారితో ముగ్గురు సభ్యుల సబ్ కమిటీని ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో ఎక్కువ సమయం కమ్యూనిటీలో ఉండే సీనియర్ సిటిజన్లు, లేడీస్, రిటైర్డు ఉద్యోగులు ఉండేలా చేయాలి. ఈ కమిటీ బహిరంగ ప్రదేశాలపై నిఘా ఉంచాలి.
కమ్యూనిటీలో ఏవైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై సభ్యులు ఫిర్యాదులు చేయడానికి వీలుగా ఒక యాప్ ఏర్పాటు చేయాలి. వీటిలో ఫిర్యాదు చేసే వాళ్ల వివరాల్ని రహస్యంగా ఉంచాలి. ఫిర్యాదులు, సందేశాలను సబ్‌కమిటీ మాత్రమే పరిశీలన చేయాలి. ఫిర్యాదులు అందితే తక్షణం స్పందించి ఎగ్జిక్యూటివ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి.
చట్టవిరుద్ధమైన ఆక్రమ కార్యకలాపాలను గుర్తిస్తే సంబంధిత పోలీసులకు కూడా సబ్ కమిటీ చెప్పాలి. క్లబ్ హౌస్ వినియోగంలో చేయాల్సినవి, చేయకూడనివాటిపై మార్గదర్శకాలు రూపొందించి.. అందులో నివాసితులకు, ఓనర్స్‌కు, మెంబర్స్‌కు అసోసియేషన్ సమాచారం ఇవ్వాలి.
క్లబ్స్‌ను చట్టవిరుద్ధమైన పనులకు వినియోగిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయనే హెచ్చరికలు కూడా పంపాలి’ అని అదేశించింది. పిటిషన్‌పై విచారణను మూసివేసింది.
పెరుగుతున్న ఫిర్యాదులు
‘కమ్యూనిటీ, ప్లాట్స్‌లో భిన్న వ్యక్తు లు, వర్గాలవారు ఉంటారు. ఇందులో భేదాభిప్రాయాలు, పబ్లిక్ న్యూసెన్స్, శాంతికి భంగం కలిగించడం వంటి అం తర్గత విభేదాలు, గేమింగ్, అనధికారికం గా మద్యం సేవించడం, ఇతర నేరపూరి త చర్యలకు ఆస్కారం ఉంది. ఇవి తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, సహకార సంఘాల చట్టం కింద పరిష్కారం కావు.
విల్లాలు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల్లో పొరుగువారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే పిటిషనర్ల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పార్కింగ్, పెంపుడు కుక్కలు, నిర్వహణ చార్జీలు చెల్లించకపోవడం, పార్టీల నిర్వహణ, డీజేల ఏర్పాటు, రాత్రిపూట సౌండ్ సిస్టం, క్లబ్ హౌస్ దుర్వినియోగం వంటివి ఎక్కువగా ఉంటున్నాయి.
376 విల్లాలు ఉన్న ఇందూ ఫార్చ్యూన్ వంటి కమ్యూనిటీలో రోజువారీ కార్యక్రమాలను నియంత్రిండం అసోసియేషన్‌కు కష్టమే కావచ్చు.. తెలంగాణ అపార్ట్‌మెంట్స్ యాక్ట్ కిందనే అవన్నీ నడుస్తున్నాయి. అయితే, వాటిని అమలు చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఆ స్థాయి ఉన్నత ప్రమాణాలు ఉన్న విల్లాల్లోని వాళ్లు ధనవంతులు కావడంతో వాళ్లలో చాలామంది అధికారులు, పోలీసులపై ప్రభావం చూపుతున్నారు.
ధనికులు నివాసం ఉంటున్న కమ్యూనిటీల్లో పిటిషనర్ వంటి ఒంటరి వ్యక్తి పోరాటం చేయడం చాలాకష్టం. సీటీ పోలీసు చట్టంలోని సెక్షన్ 22 కింద ఊరేగింపులు, వీధులను సక్రమంగా నిర్వహించడం, బహిరంగ ప్రదేశాలను, సంగీతాన్ని నియంత్రించే ప్రత్యేక అధికారాలు పోలీసులకు ఉన్నాయి.
వీటితోపాటు హైదరాబాద్ సిటీ లౌడ్‌స్పీకర్ రూల్స్, హైదరాబాద్, సికింద్రాబాద్ (పబ్లిక్ ప్లేస్ ఆఫ్ హాల్ట్/పీస్ ఆప్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్/అమ్యూజ్మెంట్) రూల్స్, శబ్దకాలుష్య నియంత్రణ నిబంధనలు, పర్యావరణ, అటవీశాఖ జారీచేసిన జీవో 172ల కింద ప్రత్యేక అధికారాలు కూడా ఉన్నాయి.
ఈ చట్టాలు, నిబంధనల కింద గేటెడ్ కమ్యూనిటీల్లో చేయాల్సినవి, చేయకూడని వాటిపై తగిన సూచనలను నిబంధనలతో సహా అసోసియేషన్లకు సిటీ పోలీస్ కమిషనర్ పంపాలి’ అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.