calender_icon.png 26 October, 2024 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెట్టీ పప్పీస్..!

25-05-2024 12:05:00 AM

కుక్కకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదంటారు. వాటి ప్రేమ, ఆప్యాయత పెట్స్ ప్రియులకు మాత్రమే అర్థం అవుతాయి. పెట్స్ తమ హావభావాలతో జంతు ప్రేమికులను కట్టిపడేస్తాయి. ‘హచికో’ మూవీలో తన యజమాని పట్ల కుక్క చూయించిన ప్రేమ 

ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇంట్లో పెట్స్ పెంచుకోవడం వల్ల పిల్లల్లో మానసిక ఆనందంతో పాటు ప్రేమ, ఆప్యాయత, దయాగుణం అలవడుతాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి దూరంగా.. ప్రకృతికి దగ్గరగా.. చిన్నారులను పెంచుకుందాం. పెట్స్ వల్ల కలిగే ఉపయోగాలెంటో ‘ఆటాపాటా’లో చూసేయండి..!

ప్రపంచంలో అనంతమైన, అచంచలమైన ప్రేమను చూపేవి ఏవైనా ఉన్నాయంటే మనం పెంచుకునే మూగజీవులే అని జంతు ప్రేమికులు అంటుంటారు. వాటి ప్రేమను, ఆ జీవుల కళ్లలో కనబడే అమాయకత్వాన్ని చూస్తే ఎవరైనా సరే జంతు ప్రేమికుల మాటలు నిజమేనని ఒప్పుకోక తప్పదు. పెట్స్‌ను ఇంట్లో పెంచడం వల్ల వాటితో ఆడుకోవడం వల్ల మంచి బంధం ఏర్పడుతుంది. దయ, కరుణలాంటి మానవత్వ గుణాలు పిల్లలలో పెరుగుతాయి. దీంతో పిల్లలు తమ తోటి వారితో ప్రేమానురాగాలతో మెలుగుతారు.

ఆత్మవిశ్వాసం, ధైర్యం..

బాధలో ఉన్నప్పుడు చుట్టూ ధైర్యాన్ని ఇచ్చేవారు లేకుంటే బాధ ఎక్కువవుతుంది. అదే పెంపుడు జంతువులను పెంచుకున్నామనుకోండి అవి మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకొని, బాధలో ఉన్నప్పుడు ఓదార్చడానికి శతవిధాల ప్రయత్నిస్తాయి. ‘777 చార్లీ’ మూవీలో హీరోకు కుక్కకు మధ్య అనుబంధాన్ని దర్శకుడు అద్భుతంగా వ్యక్తపరుస్తాడు. కేవలం సినిమాలో పెంపుడు జంతువుల పాత్రలే కాదు నిజ జీవితంలో కూడా పిల్లలకు, పెద్దలకు పెట్స్‌లు ఓ ధైర్యాన్ని ఇస్తాయి. ఎదిగే పిల్లలకు పెంపుడు జంతువుల సహవాసం ఎంతో అవసరం. వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగడానికి దోహదపడుతుంది.

మానసిక ఎదుగుదల..

కొందరికి వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల ఉండదు. ఇటువంటి పరిస్థితిని ఆటిజం అంటారు. వాడుక భాషలో చెప్పాలంటే మందబుద్ధి. పిల్లల్లో చిన్నప్పుడే మొదలయ్యే నాడీ సంబంధిత వ్యాధి రాకుండా పెంపుడు జంతువులు అడ్డుకుంటాయని కొన్ని అధ్యయనాలు, పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో పిల్లలు నలుగురిలో కలిసిపోతారు. శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఎదుగుదల కూడా బాగుంటుంది.

ఏకాగ్రత..

పెంపుడు జంతువులను పెంచుకోవడం వల్ల పిల్లల్లో విషయపరిజ్ఞానం పెరుగుతుంది. అంతేకాకుండా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. రంగులను, జంతువులను, వివిధ వస్తువులను తొందరగా గుర్తుపడతారు. పిల్లలు పెంపుడు జంతువులతో కలిసి ఆడుకోవడం వల్ల కేవలం విషయపరిజ్ఞానమే కాదు.. భవిష్యత్తులో వారి జీవనశైలి కూడా మెరుగవుతుంది. ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.

సామాజిక ప్రయోజనం..

పెట్స్ హావభావాలు అవి చేసే చిలిపి పనులు పిల్లలకు తేలికగా అర్థమవుతాయి. దీంతో బయటి జంతువులతో కూడా ఎలా మెలగాలో, వీధిలో తిరిగే జంతువులతో ఎలా ఉండాలో తెలుస్తుంది. బయట తిరగడానికి వెళ్లినప్పడు అనుకోకుండా ఏదైనా జంతువు పైకి వస్తే ఎలా స్పందించాలో అర్థం అవుతుంది. అంతేకాకుండా.. పెంపుడు జంతువులతో సహవాసం చేయడం వల్ల మానసిక, శారీరక ఎదు గుదల బాగుంటుంది. తమతోటి వారితో పిల్ల లు తొందరగా కలిసిపోతారు.

ఎటువంటి అరమరికలు లేని బలమైన పరిచయాలను, బంధా లను ఏర్పాటు చేసుకుంటారు. దీంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. ఒక ఆరోగ్య కరమైన సమాజం ఏర్పడాలంటే మన చుట్టూ ఉన్నవాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. పెంపుడు జంతువులు పెంచడం కొందరికి కాలక్షేపమే కావచ్చు కానీ వాటి వల్ల వాళ్లకే తెలియకుండా చాలా ఉపయోగాలు ఉంటాయి. వాటి ప్రభావం కూడా పెంచేవారిపై పరోక్షంగా కనిపిస్తుంది.

శారీరక వ్యాయామం..

పెంపుడు జంతువులను ఇంటికే పరిమితం చేయకుండా ప్రతిరోజు పార్క్ లేదా బయటకు తీసుకుపోవడం వల్ల పిల్లలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంకా ఎంజాయ్ కూడా చేస్తారు. అంతేకాకుండా వ్యాయామం చేసినట్టు అవుతుంది. రోజువారి నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెప్తుంటారు. కాబట్టి చిన్నపట్టి నుంచే పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ అలవాటు అవుతుంది. పెంపుడు జంతు వుల వల్ల కేవలం ఈ ఉపయోగాలే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి. పెట్స్‌ను పెంచడం వల్ల పిల్లలకు బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది.

అంతేకాదు ఒంటరితనంతో పోరాడి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బతుకుతారు. తమ చుట్టూ ఉన్న బంధాలను గౌరవి స్తారు, భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఓపిక, సహనం, సానుభూతిలాంటివి అలవాటు అవుతాయి. స్వీయ క్రమశిక్షణతో ఉంటారు. పెంపుడు జంతువులతో ఉన్న ఉపయోగాలు ఎంటో తెలిశాయి కదా! మరెందుకు ఆలస్యం ఎలాంటి భయం లేకుండా పశు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పెట్స్‌ను పెంచుకోండి.