calender_icon.png 24 November, 2024 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కు కాకా పేరు పెడితే సహించేది లేదు

27-09-2024 06:17:29 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ భవనానికి స్వర్గీయ గడ్డం వెంకట స్వామి (కాకా) పేరు పెడితే సహించేది లేదని బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో గెలుపొంది న మున్సిపల్ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి వంతపడుతూ కాక పేరు పెట్టాలని మాట్లాడటం అవివేకమన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో మార్కెట్ భవనాన్ని నిర్మించార ని, ఈ భవనానికి కాకా పేరు పెట్టడానికి ప్రయత్నించడానికి తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అమృత్ పథకం కింద రూ 61.58 కోట్ల నిధులతో గత ప్రభుత్వం కేంద్రం ద్వారా మంజూరు చేయించిన ఎల్లంపల్లి తాగునీటి పథకాన్ని తానే తీసుకువచ్చినట్టు ఎమ్మెల్యే వినోద్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

గత బిఆర్ఎస్ హయాంలో రూ 17 కోట్ల నిధులతో వంద పడకల ఆసుపత్రి నిర్మించామని. కొన్ని కారణాల వల్ల 100 పడకలకు అనుమతి లభించలేదన్నారు. బెల్లంపల్లి ప్రాంత ప్రజలు డెంగ్యూ, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే హైదరాబాదులో ఉంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లిలోనే పూర్తి కాలం ఉంటానని బాండ్ పేపర్ రాయించి కనీసం ఒక్కరోజు కూడా నిద్ర చేయడం లేదని ఎద్దేవా చేశారు. సంవత్సరానికి 60 రోజులు మాత్రమే ఉంటానని చెప్పడం బెల్లంపల్లి ప్రజలను పూర్తిగా మోసం చేయడమే అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మంజూరు చేయించలేదన్నారు. 10 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం బెల్లంపల్లి ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకువచ్చిందో తిరపాల్సిన అవసరం ఉందన్నారు.

బిఆర్ఎస్ నాయకులు నూనెటి సత్యనారాయణ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలకు కొబ్బరికాయలు కొట్టుకుంటూ కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగాలు పెట్టిస్తామని ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బ్రోకర్ల జాబితా తమ దగ్గర ఉందని త్వరలోనే వారి చిట్టా వెల్లడిస్తామన్నారు. గత ప్రభుత్వం బెల్లంపల్లి లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరు చేయిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే దాని ఊసే లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్రోకర్ల హవా నడుస్తుందని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, మద్దెలగోపి, సాజిద్ వాజిద్, అలీ భాయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.