calender_icon.png 28 September, 2024 | 4:51 AM

నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము!

28-09-2024 02:57:03 AM

నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్‌కు చేరుకొని, నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాల యం 21వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.

కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ తదితరులు గౌర వ అతిథులుగా హాజరుకానున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సీటీ చాన్స్‌లర్ జస్టిస్ అలోక్ అరాధే ఈ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహిస్తారు.

వర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు వార్షిక నివేదికను సమర్పిస్తారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ వాసంతి స్నాతకోత్సవ ఊరేగింపునకు నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా 57 మంది విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించనున్నారు. వివిధ శ్రేణుల్లో 592 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారు. 

మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా సీతక్క..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడంతోపాటు వీడ్కోలు పలికే వరకు రాష్ట్రపతి వెంటే మంత్రి సీతక్క ఉంటారు.