calender_icon.png 20 November, 2024 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ర్టలో రాష్ర్టపతి పాలన?

31-08-2024 02:05:27 AM

  • కుతకుత ఉడుకుతున్న కూటములు
  • అధికార కూటమిలో అజిత్ పవార్ బీటలు
  • సీఎం షిండేపై పెద్దన్న బీజేపీకి అనుమానాలు
  • విపక్ష ఎంవీఏలో లోక్‌సభ ఫలితాల జోష్
  • సీఎం అభ్యర్థిత్వం కోసం గోతులు తవ్వుకొంటున్న మిత్రులు
  • మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకే అధిక అవకాశాలు
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటమే
  • అందుకే కొంతకాలం ఎన్నికలు వాయిదా?
  • అప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన!

ముంబై, ఆగస్టు 30: దేశంలోనే అత్యంత ధనవంతమైన రాష్ట్రం మహారాష్ట్రలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. మరో నెలన్నరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సి ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తున్నది. ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం, రాజకీయ పోరు మొదలవుతుంది.

కానీ, ఈ రాష్ట్రంలో అధికార కూటమితోపాటు ప్రతిపక్ష కూటమిలోనూ ఎవరికి వారే అంతర్గతంగా కత్తులు దూసుకొంటున్నారు. ముఖ్యంగా అధికార కూటమిలో చోటుచేసుకొంటున్న పరిణామాలు నిజమైనవేనా? లేక ఎన్నికలను వాయిదా వేయించి రాష్ట్రపతి పాలన విధించటానికి జరుగుతున్నాయా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 

వాయిదా కోసం పాట్లు!

మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 19వ తేదీతో ముగుస్తుంది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించి ఫలితాలను ప్రకటించాలి. అది జరుగాలంటే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి. ఇటీవల హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) షెడ్యూల్ విడుదల చేసింది. నిజానికి వాటితోపాటే మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగాలి. కానీ, పండుగలున్నాయని, భద్రతా బలగాలు సరిపోను లేవని, ఎన్నికల రోల్ సిద్ధం కాలేదన్న ఏవో సాకులు చూపి వాయిదా వేశారు.

దేశమంతా లోక్‌సభ ఎన్నికలు నిర్వహించటానికి సరిపోయిన భద్రతా బలగాలు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సరిపోను లేవు అనటం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమే. ఇక పండుగల సాకు కూడా అంత నమ్మదగినదిగా లేదు. ఎన్నికల రోల్ సిద్ధం చేయకపోవటం ఈసీ వైఫల్యం కిందికే వస్తుంది. కానీ, అసలు కారణాలు ఇవేవీ కావని ఎన్నికల పరిశీలకులు అంటున్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకే అధికార బీజేపీ ఈసీని ప్రభావితం చేసినట్టుగా కనిపిస్తున్నదని చెప్తున్నారు.

గెలుపు కలే..

గత ఐదేండ్లలో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. రెండేండ్లు తిరక్కుండానే శివసేన విచ్చిన్నమై ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి కోల్పోయారు. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండేను ముందుపెట్టి కథ నడిపించిన బీజేపీ.. శివసేనను నిలువునా చీల్చి తన నీడలో షిండే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కొంతకాలానికే ఎన్సీపీ చీలిపోయింది. తన పెదనాన్న శరద్‌పవార్‌కే వెన్నుపోటు పొడిచి అజిత్ పవార్ తన వర్గాన్ని తీసుకొని వెళ్లి బీజేపీ శివసేన ప్రభుత్వంలో కలిసిపోయారు.

బీజేపీ రాజకీయం దెబ్బకు అటు ఉద్ధవ్ శివసేన, ఇటు శరద్‌పవార్ ఎన్సీపీ గుర్తింపును కూడా కోల్పోయాయి. వాటికి ఇప్పుడు ఎన్నికల గుర్తులు కూడా తాత్కాలికమైనవే మిగిలాయి. ఈ అక్రమ రాజకీయ సంబంధాలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మంచి గుణపాఠమే నేర్పాయి. 48 ఎంపీ స్థానాలకు గాను అధికార కూటమి 17 సీట్లకే పరిమితమైంది. విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి 30 స్థానాల్లో గెలిచి సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి నెలకొన్నది.

ఇప్పటికిప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 100 సీట్లకు మించి రావని నివేదికలు చెప్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 145 సీట్లు కావాలి. ఇదే సమయంలో విపక్ష ఎంవీఏకు సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నదని నివేదికలు చెప్తున్నాయి. దీంతో ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేయాలని బీజేపీ పావులు కదుపుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకు చివరి అస్త్రంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని చెప్తున్నారు.

వివాదాలన్నీ ముందస్తు వ్యూహమేనా?

మొన్నటివరకు రాసుకు పూసుకు తిరిగిన బీజేపీ సీఎం షిండే అజిత్ పవార్ ఒక నెలలోనే ఉప్పు నిప్పుగా మారిపోయారు. ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనదారి తనదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఛత్రపతి శివాజీ విగ్రహం కూలితే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన రెండుమూడు రోజుల్లో ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవటం ఖాయంగా కనిపిస్తున్నది.

అయితే, ఆయన విపక్ష కూటమిలోకి వెళ్లబోరని, అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేయబోతున్నారని చెప్తున్నారు. అజిత్ పవార్ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తే దాదాపు వంద అసెంబ్లీ స్థానాల్లో విపక్ష ఎంవీఏకు గెలుపు అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే ఆయన తనంత తానుగా ఎన్డీయే నుంచి బయటకు వెళ్లి స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్టుగా ప్రజలను నమ్మించే రాజకీయం నడుస్తున్నదని, దీని వెనుక కూడా బీజేపీ చాణక్య వ్యూహమే ఉన్నదని చెప్తున్నారు.

ఇదే సమయంలో శరద్‌పవార్ పార్టీకి కేటాయించిన గడియారం గుర్తును కూడా ఈసీ త్వరలో రద్దుచేయబోతున్నదని సమాచారం. మరోవైపు విపక్ష కూటమికి ఎంఐఎం శిఖండిలా తయారైంది. ఒవైసీ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 35 చోట్ల పోటీ చేసినా అధికార కూటమి గెలుపు ఖాయమవుతందని భావిస్తున్నారు. ఎందుకంటే ఎంఐఎం చీల్చే ఓట్లన్నీ కాంగ్రెస్‌వేనని విశ్లేషిస్తున్నారు.

రాజకీయాలతోపాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పేద మహిళల కోసం లాడ్లీ మెహనా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా నెలకు ఒక్కో పేద మహిళకు నేరుగా రూ.1500 అందజేస్తారు. ఇక ప్రధాని మోదీ వేలకోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. 

షిండేపై నమ్మకం లేకనే..

ఎంవీఏ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏక్‌నాథ్ షిండేను వాడుకొన్నప్పటికీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ఆయన నాయత్వంలో వెళ్లటానికి బీజేపీ సుతారమూ ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఆయన నమ్మకద్రోహిగా ప్రజల్లో ముద్ర పడ్డారు. అలాంటి వ్యక్తిని ముందుపెట్టి ఎన్నికలకు వెళ్తే వస్తాయనుకున్న ఓట్లు కూడా రావని బీజేపీ భావిస్తున్నది. అందుకే ఆయన తో తెగుదెంపులు చేసుకొనే మార్గాలను అణ్వేషిస్తున్నది.

అతి త్వరలో అది కూడా జరుగొచ్చ ని రాజకీయ పండితులు అంటున్నారు. ఆ పరిణామం నేరుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుంది. అప్పుడు నవంబర్ 19 లోపు కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. కనీసం మరో ఏడాదైనా ఎన్నికలను వాయిదా వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఒక్కో అడుగూ ముందుకేస్తున్నదని చెప్తున్నారు. 

బీజేపీకి ఇప్పుడు మహారాష్ర్టే కీలకం

లోక్‌సభ ఎన్నికల్లో అతి విశ్వాసానికి పోయిన బీజేపీ.. 400 ఎంపీ సీట్లు గెలుస్తామని ఊదర గొట్టింది. కానీ, 2019లో వచ్చినన్ని కూడా రాలేదు. దీంతో మిత్ర పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీకి మహారాష్ట్ర ఎన్నికల రూపంలో మరో కఠిన పరీక్ష ఎదురు కాబోతున్నది. ఈ ఎన్నికల్లో గనుక బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం ఉత్తర భారతం మొత్తం పడుతుంది.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు కొండంత బలం చేకూరుతుంది. మరోవైపు దేశంలో అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ర్టే. దేశానికి అత్యధిక పన్నులు కడుతున్నది కూడా ఈ రాష్ట్రమే. ఇలాంటి కీలక రాష్ట్రాన్ని చేజార్చుకొంటే కేంద్రంలో కూడా మోదీ సర్కారుకు ఉక్కపోత తప్పదు. అందుకే ఏం చేసైనా మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నదని రాజకీయ పండితులు చెప్తున్నారు.     

టైట్లర్‌పై కేసు నమోదు చేయండి

న్యూఢిల్లీ, ఆగస్టు 30: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులు కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. పుల్‌బంగశ్ గురుద్వారా హత్యల కేసులో టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాకేశ్ సియాల్ ఉత్తర్వులు జారీ చేశారు. టైట్లర్‌పై విచారణ చేపట్టేందుకు సరిపడా ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా చాలా చోట్ల హింసాకాండ జరిగింది. ఈ అల్లర్లకు సంబంధించి గతంలో ఓ ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. 1984లో తెల్ల రంగు కారులో వచ్చి అల్లరిమూకలను టైట్లర్ రెచ్చగొట్టారని చెప్పారు. మన తల్లిని చంపినవారిని చంపేయండి అంటూ ఉసిగొల్పినట్లు సాక్షి పేర్కొన్నాడు. దీన్ని పరిగణించిన న్యాయస్థానం తాజా తీర్పునిచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.